Dalita Bandhu: దళిత బంధు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్‌

Dalita Bandhu: హుజూరాబాద్ సాక్షిగా అసలైన పొలిటికల్ గేమ్ * బైపోల్‌లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు

Update: 2021-07-25 11:05 GMT
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Dalita Bandhu: ఈటల రాజీనామాతో తెలంగాణ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా మారిపోయాయి. ఇదే సమయంలో 2023 ఎన్నికలకు హుజూరాబాద్ బైపోల్ సెమీఫైనల్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక పోరుకోసం గులాబీ బాస్ నేరుగా రంగంలోకి దిగినట్లే కనిపిస్తోంది. ఓ వైపు దళితబంధు.. మరోవైపు గులాబీ కార్ ఎక్కుతున్న కీలక నేతలు. పరిస్థితి చూస్తుంటే హుజూరాబాద్ సాక్షిగా అసలైన పొలిటికల్ గేమ్ షురూ అయినట్లే కనిపిస్తోంది.

దళిత బంధు పథకం చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. 2014 తర్వాత, 2018 ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణ కోసం పని చేసిన కేసీఆర్.. మళ్లీ ఆ దిశగానే అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రాజకీయ పునరేకీకరణలు హుజూరాబాద్ ఉపఎన్నికే లక్ష్యంగా జరుగుతున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల భావన. ఇదే సమయంలో కేసీఆర్ వ్యూహాలు 2023 అసెంబ్లీ యుద్ధానికి అజెండాను ఫిక్స్ చేస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మొదట టీటీడీపీ చీఫ్.. ఆ తర్వాత కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి.. తాజాగా గులాబీ పార్టీకి అనూకూలంగా మోత్కుపల్లి కామెంట్స్. ఇలా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పొలిటికల్ పరిణామాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. హుజూరాబాద్‌ బైపోల్‌కు ముందు ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలంతా కారెక్కుతున్నారు. ఇదే సమయంలో ఈటల చేరికతో బీజేపీలో ఉత్సాహం, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ ఎన్నికతో కాంగ్రెస్‌లోనూ జోష్ కనిపిస్తున్నా.. కీలక నేతలు గులాబీ పార్టీలోకి క్యూ కట్టడం వంటి అంశాలు రాజకీయ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న వ్యూహానికి గులాబీ దళం పదునుపెట్టినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ అడ్డాగా ఉన్న హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేసి.. బీజేపీని, ఈటలను దెబ్బతీయడం, అదే సమయంలో రేవంత్ రాకతో జోష్ మీదున్న కాంగ్రెస్‌కు షాకివ్వడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ వ్యూహంతోనే ఎల్.రమణ, కౌశిక్‌రెడ్డిలను టీఆర్ఎస్‌లోకి వెల్‌కమ్ చెప్పినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో మోత్కుపల్లి కూడా గులాబీ పార్టీకి తోడవ్వడం కలిసొచ్చే అంశం. దీనికితోడు దళిత బంధుపై విపక్షాల విమర్శలకు నేరుగా గులాబీ బాసే కౌంటర్ ఇవ్వడం టీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనని క్లారిటీ ఇచ్చినట్లైంది.

మొత్తానికి దళిత బంధు పథకంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా దళితుల చుట్టూ తిరుగుతున్నాయి. దళిత బంధును రానున్న రోజుల్లో పార్టీపరంగా బలపడడంతో పాటు.. అధికార సుస్థిరత కోసం గులాబీ బాస్ పక్కాగా అమలు చేస్తున్న పొలిటికల్ స్కెచ్‌గా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News