గల్ఫ్ దేశంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా వాసి

* 2013 అక్టోబర్‌లో గల్ఫ్‌ దేశానికి వెళ్లిన నర్సారెడ్డి * నవంబర్‌లో రోడ్డు మరమ్మత్తులు చేస్తుండగా.. * కంపెనీ వాహనం ఢీ కొట్టి నర్సారెడ్డి మృతి

Update: 2021-02-10 06:19 GMT

Representational Image

ఉపాధి కోసం దేశం కానీ దేశం వెళ్లాడు. కుటుంబాన్ని పోషించుకోవడానికి సొంత ఊరును వదిలాడు. కానీ.. విధి వెక్కిరించింది. కూటి కోసం వెళ్లిన నర్సారెడ్డిని గల్ఫ్‌దేశం పొట్టనపెట్టుకుంది. అంతేకాదు నమ్ముకున్న సంస్థ నర్సారడ్డి మృతదేహన్ని బాధిత కుటుంబానికి అప్పచెప్పలేదు. అయితే.. చివరిచూపునకు నోచుకునేందుకు అవకాశం కల్పించాలని మృతుడి కుటుంబసభ్యులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు.. న్యాయం కావాలంటూ కోర్టు మెట్లక్కెరు.

అది నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన నర్సారెడ్డి ఉపాధి కోసం 2013 అక్టోబర్‌లో గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. ఇరాక్‌ సరిహద్దులోని సకాకా పట్టణ మున్సిపల్‌ కార్యాలయంలో కార్మికుడిగా చేరాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైంది. ఊహించని విధంగా నర్సారెడ్డిని మృత్యువు కబళించింది. గత నవంబర్‌లో రోడ్డు మరమ్మత్తులు చేస్తుండగా కంపెనీ వాహనం ఢీ కొట్టి నర్సారెడ్డి మృతి చెందాడు. దీంతో నర్సారెడ్డి కుటుంబం రోడ్డున పడింది.

బతుకు బండిని లాగడానికి.. ఉన్న ఊరును.. కట్టుకున్న భార్యను, కన్నపిల్లల్ని వదిలి ఉపాధి కోసం వెళ్లిన నర్సారెడ్డి చివరి చూపునకు నోచుకోకపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. స్వగ్రామానికి మృతదేహం తెప్పించి తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన చెందుతున్నారు. మృతదేహం కోసం ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదంటూ వాపోయారు.

నర్సారెడ్డి చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా మృతదేహం స్వగ్రామానికి చేరుకోలేదు. ఎవరిని కలిసిన ప్రయోజనం లేదని భావించిన మృతుడి కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమకు చివరి చూపునకు అవకాశం కల్పించాలంటూ వేడుకున్నారు. మృతుడి భార్య లక్షీ దీనగాధకు స్పందించిన ప్రవాస మిత్ర యూనియన్‌ మద్దతు పలికింది. దీంతో బాధిత కుటుంబసభ్యులతోపాటు యూనియన్‌ న్యాయపోరాటికి దిగింది. అటు తన కుమారుడి చివరి చూపునకు అవకాశం కల్పించాలని మృతుడి తల్లి కన్నీళ్లుపెట్టుకుటుంది.

Tags:    

Similar News