తెలంగాణలో కొత్తరకం కరోనా వైరస్ టెన్షన్.. బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చిన 1200 మంది
బ్రిటన్ నుంచి తెలంగాణకు వచ్చినవారిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ముందు 7 కేసులుంటే ఇప్పుడు ఆ సంఖ్య 16కు చేరింది. వారిలో బ్రిటన్‌కు చెందిన కొత్త రకం వైరస్ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సీ చేయనున్నారు. సీసీఎంబీకి శాంపిళ్లను పంపించారు. ఇంగ్లండ్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ నెల 9 నుంచి ఇప్పటివరకు ఆ దేశం నుంచి తెలంగాణకు 1200 మంది వచ్చారు. వీరిలో 926 మందిని అధికారులు గుర్తించారు.
యూకే నుంచి వచ్చిన 926 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్ తేలింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ రోగుల్లో కొత్త రకం బ్రిటన్ వైరస్ ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సీ చేయనున్నారు. శాంపిళ్లను సీసీఎంబీకి పంపారు. రెండు రోజుల్లో ఫలితాలు రానున్నాయి.
16 మంది కరోనా రోగులను వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులే ఎక్కువుగా ఉన్నారు. వీరితో సన్నిహితంగా మెలిగిన కుటుంబసభ్యులు, స్నేహితులను 76 మందిని గుర్తించారు. క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకా వివిధ జిల్లాల్లో ఉన్న బ్రిటన్‌కు చెందిన పాజిటివ్ వ్యక్తులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.