పదహారేళ్ళయినా.. పరిహారం అందలేదు.. నాగరాల గ్రామ ప్రజల వెతలు !

Update: 2020-08-24 08:51 GMT

Nagarala Village people still not receive any compensations from 16 years: సాగునీటి ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయి నిర్వాసితులుగా మారిన కుటుంబాలపై ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. భూములు, ఇళ్లు కోల్పోయి ఇతరులకు వెలుగునిచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదుకోలేదు. పునరావాసం కల్పించలేదు. బాధితులు సర్వం కోల్పోయి 16 ఏళ్లు కావస్తున్నా ఇంకా వారి బతుకులు నీళ్లల్లోనే మునిగి తేలాడుతున్నాయి.

2005 లో రాజీవ్ భీమా పేజ్ -2 ఎత్తిపోతల పథకంలో భాగంగా వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో 1.5 టీఎంసీల సామర్థ్యంతో రంగ సముద్రం రిజర్వాయర్‌ను ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రక్రియలో నాగరాల గ్రామం ముంపునకు గురైంది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉన్న 525 ఇండ్లతో పాటు 1400 ఎకరాల భూమిని సేకరించి ప్రాజెక్టుకు అప్పజెప్పారు. నాగరాల గ్రామస్తులు కోరిన విధంగా అధికారులు మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి కేంద్రంలో 515, రెండో సెంటర్లో 282, మూడో సెంటర్లో 277 ప్లాట్లు చేసి 977 మందికి స్థలాలు కేటాయించారు.

పునరావాస కేంద్రాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ నేటికి తాగునీటి సౌకర్యం కల్పించలేదు. మూడు సెంటర్లలో ట్యాంకులు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు నీళ్లు వదలడం లేదు. పాత ఊర్లో ఉన్న శ్మశాన వాటిక ప్రాజెక్టులో మునిగిపోయింది. ఎవరైన మృతి చెందితే ఖననం చేసేందుకు స్థలం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకా, పునరావాసం కల్పించక ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్వాసితుల భూములు, ఇండ్లకు 2005 చట్ట ప్రకారం పరిహారం చెల్లించింది. పునరావాసం కల్పించేందుకు 525 ఇండ్లలో 977 కుటుంబాలను గుర్తించి, వారికి ప్లాట్లు కూడా కేటాయించింది. అయితే ఇళ్లు తామే నిర్మించుకుంటామని, నిర్వాసితులు కోరడంతో వారందికి 26.29 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. అంటే ఒక్కో కుటుంబానికి 2 లక్షల 70 వేలు వరకు రావాలి. కానీ 2011, 2016 లో కొంత మేర డబ్బులు మాత్రమే చెల్లించారు. ఇంకా 22.38 కోట్లు చెల్లించాల్సి ఉంది. పరిహారం కింద ఒకో కుటుంబానికి కేవలం 40 వేలు మాత్రమే ఇచ్చినట్లు నిర్వసితులు చెప్తున్నారు. దాదాపు 16 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించకపోవడం, పునరావాసం కల్పించకపోవడంతో నాగరాల గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

Tags:    

Similar News