Musi River: ఉనికిని కోల్పోతున్న మూసీ.. చెత్తా చెదారం, హానికర కలుషితాలతో...

Musi River: పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారుతున్న మూసీ...

Update: 2022-04-09 01:30 GMT

Musi River: ఉనికిని కోల్పోతున్న మూసీ.. చెత్తా చెదారం, హానికర కలుషితాలతో...

Musi River: నాగరికతను నేర్పిన నది.. నేడు ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఆ నదిని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డ నగరాలు అభివృద్ధి పేరుతో రూపురేఖలు మార్చుతున్నారు. అయినా ఆ నది పరివాహక ప్రాంతాలు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు భవన నిర్మాణ వ్యర్థాలను నది పరివాహక ప్రాంతాల్లో పోస్తూండటం ఆందోళనకు గురిచేస్తుంది. నది కలుషితమవ్వడమే కాకుండా పరిసర ప్ర్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. జీవనదిగా పేరొంది నేడు జీవం లేకుండా పోతున్న మూసీ నదిపై స్పెషల్ రిపోర్ట్...

కాలుష్యకాసారం మూసీ

మూసీ నది.. ఒకప్పుడు ఈ నదిలో నాణెం వేస్తే పైకి కనిపించేదని చెప్పుకునే వారు. ఒకప్పుడు మూసీ నది పరీవాహకం గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు కానీ నేడు మూసి జలాలు విషతుల్యమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలతో మూసీ కాలుష్య కాసారంగా మారుతోంది. చెత్తాచెదారంతో. హానికర కలుషితాలతో నది అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. జీవనదిగా పేరొందిన మూసి నేడు జీవం లేకుండా పోతుంది.

కృష్ణా నదికి ఉపనదిగా..వికారాబాద్ అడవుల్లో మొదలైన మూసీ నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణా నదిలో కలుస్తుంది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ప్రవహిస్తున్న ఈ నది.. మధ్యలో ఎన్నో చేలకు నీరిచ్చి.. ఎన్నో గొంతుల దాహం తీర్చి.. అందమైన సోయగాలకు, ప్రకృతి రమణీయతకు నిలయంగా ఉంది. అయితో రోజు రోజుకు హైదరాబాద్ నగర విస్తీర్ణం పెరుగుతుండటంతో మూసీ నది బక్కచిక్కుతూ వచ్చింది. చివరకు కాల్వలా మారింది.

భాగ్యనగర వైభవాన్ని ప్రతిబింబించిన ఈ నది విషతుల్యంగా మారింది. కాలుష్య జలాలు ఓ వైపు మరో వైపు పారిశ్రామిక వ్యర్థాలను మూసీ పరివాహక ప్రాంతాల్లో డంప్ చేస్తుండటంతో నది మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. పరిశ్రమలకు చెందిన వ్యర్థాలతో పాటు భవననిర్మాణాల వ్యర్థాలను మూసీ పరివాహక ప్రాంతంలో పోస్తూ ఉండటంతో మూసీ పరిసరాలు మట్టి కుప్పలతో నిండిపోయి డంపింగ్ యార్డులను తలపిస్తుంది.

బఫర్ జోన్ లో కూడా ఎన్నో నిర్మాణాలు వెలిశాయి.అక్రమ నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేశారు. కానీ పరిస్థితి లో మాత్రం మార్పు లేదు.ఇక మూసీ సుందరీకరణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి.నిధులు లేకపోవటం వల్లే పనులు సాగటం లేదని అధికారులు చెప్తున్నారు. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం ద్వారా కొద్దిమేరైనా చెత్త డంప్ కాకుండా చూడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు ,భవన నిర్మాణాల వ్యర్థాలు వేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వ్యర్థాలు వేయకుండా నిఘా ను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మూసీ నదికి పూర్వవైభవం తెచ్చేందుకు చిత్తశుద్దితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Tags:    

Similar News