Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెర

Munugode Bypoll: సాయంత్రం 6 గంటలకు ముగియనున్న ఉపఎన్నిక ప్రచారం

Update: 2022-11-01 03:18 GMT

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెర

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తార స్థాయికి చేరింది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పరస్పర ఆరోపణలు, ప్రలోభాలు, సభలు, సమావేశాలతో సాగిన ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ప్రధాన రాజకీయపార్టీలు ఇప్పుడు ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం, పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓట్లేసేలా చూసుకొనే ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ప్రచారం ముగింపు రోజున టీఆర్ఎస్ తరఫున మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రోడ్‌షోలు నిర్వహించనుండగా, బీజేపీ కొన్ని బైక్‌ ర్యాలీలు, కాంగ్రెస్‌ మహిళా గర్జనను నిర్వహించనున్నాయి. మునుగోడులో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు పూర్తిగా కేంద్రీకరించాయి.

టీఆర్ఎస్‌ తరఫున సీఎం కేసీఆర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందు మునుగోడులో, గత నెల 30న చండూరులో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సహా మంత్రులందరూ మండలాల వారీగా బాధ్యతలు తీసుకొని పనిచేయగా..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు గ్రామాల వారీగా బాధ్యతలు తీసుకున్నారు. వామపక్షాలకున్న పట్టును ఒడిసిపట్టుకునేందుకు టీఆర్ఎస్‌ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. నారాయణపురం, చౌటుప్పల్‌, మునుగోడు మండలాల్లో కమ్యూనిస్టు పార్టీల స్థానిక కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ బలం పెంచుకోవడంపై టీఆర్ఎస్‌ కృషిచేస్తోంది.

బీజేపీ తరఫున 40 మందికిపైగా స్టార్‌ క్యాంపెయినర్లు ముమ్మరంగా ప్రచారం చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డితో మొదటి నుంచీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, మాజీ ఎంపీ వివేక్‌ మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం చేశారు. ప్రచారం ముగింపు దశకు వచ్చేసరికి పోరు హోరాహోరీగా ఉంది. గత కొన్ని రోజులుగా ప్రచారాన్ని పెంచిన కాంగ్రెస్‌ సంప్రదాయ ఓట్లను నిలబెట్టుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అభ్యర్థి స్రవంతితో పాటు ముఖ్యనాయకులు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీ రాష్ట్రంలో నిర్వహిస్తున్న జోడో యాత్రను కూడా ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. 

Tags:    

Similar News