KTR: జీహెచ్ఎంసీపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

KTR: వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని సూచన

Update: 2021-06-25 01:36 GMT
కేటీఆర్ జీహెచ్ ఎంసీ రివ్యూ మీటింగ్ (ఫోటో ది హన్స్ ఇండియా)

KTR: వర్షాకాలం సందర్భంగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వర్షాకాల ప్రణాళికల మేరకు పూర్తి సంసిద్ధతతో పనిచేయాలని కేటీఆర్‌ సూచించారు. కొన్నేళ్లుగా నగరంలో తక్కువ సమయంలోనే కుండపోత వర్షాలు పడుతున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై క్యాపింగ్, ఫెన్సింగ్ కార్యక్రమాల వేగవంతంతో పాటు నాలాల అభివృద్ధికి ఎస్‌ఎన్‌డీపీని మరింత బలోపేతం చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

నాలాలకు సంబంధించిన కార్యక్రమాలను మేయర్, కమిషనర్ ప్రత్యేకంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్లపై జరిపిన తవ్వకాల వద్ద అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని కేటీఆర్ సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు.

నగరంలో వ్యాధులు ప్రబలకుండా హెల్త్, శానిటేషన్ విభాగాలు కలిసి పని చేయాలని కోరారు. వర్షాకాల ప్రణాళికలో పారిశుధ్యానికి, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, యాంటీ లార్వా వంటి కార్యక్రమాలను ఎంటమాలజీ విభాగం మరింత పెంచాలన్నారు. 

Tags:    

Similar News