Telangana dog killings: హైదరాబాద్ సమీపంలో మరో దారుణం.. 100 కుక్కలకు విషం, కేసులు నమోదు

Telangana dog killings: హైదరాబాద్‌కు సమీపంలోని యాచారం గ్రామంలో దాదాపు 100 వీధి కుక్కలకు విషం ఇచ్చిన ఘటన కలకలం రేపింది. సర్పంచ్ సహా ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

Update: 2026-01-21 11:13 GMT

Telangana dog killings: హైదరాబాద్ సమీపంలో మరో దారుణం.. 100 కుక్కలకు విషం, కేసులు నమోదు

Telangana dog killings:  తెలంగాణలో వీధి కుక్కల హత్యలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన ఘటనలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా హైదరాబాద్‌కు సమీపంలోని రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో మరో దారుణం వెలుగుచూసింది. దాదాపు 100 వీధి కుక్కలకు విషం ఇచ్చి చంపిన ఘటన ఆలస్యంగా బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించి స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో పాటు మరో ఇద్దరు పంచాయతీ ప్రతినిధులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జనవరి 19న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన జంతు సంక్షేమ కార్యకర్త యాచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహితతో పాటు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఫిర్యాదులో దాదాపు 100 కుక్కలను విషపూరిత పదార్థాలతో చంపినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక పరిశీలనలో సుమారు 50 కుక్కలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ అనంతరం మృతుల సంఖ్యను నిర్ధారిస్తామని వెల్లడించారు.

ఇటీవల హన్మకొండ జిల్లాలోని శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో సుమారు 300 వీధి కుక్కలను చంపిన ఘటనల్లో ఇద్దరు మహిళా సర్పంచ్‌లు, వారి భర్తలతో సహా తొమ్మిది మందిపై కేసులు నమోదు అయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లాలో జరిగిన మరో ఘటనలో సుమారు 200 కుక్కల మృతిపై ఐదుగురు గ్రామ సర్పంచ్‌లతో సహా ఆరుగురిపై కేసులు నమోదయ్యాయి.

సర్పంచ్ ఎన్నికల సమయంలో వీధి కుక్కల సమస్యను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన కొందరు ప్రజాప్రతినిధులు చట్ట విరుద్ధ మార్గాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలపై జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండగా.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News