మేడారం మహాజాతర ముగిసింది. భక్తజన నీరాజనాలు అందుకున్న సమ్మక్క సారాలమ్మ వన ప్రవేశం చేశారు. అంతకు ముందు సమ్మక్క, సారలమ్మలకు గిరిజన పూజారులు పూజలు నిర్వహించారు. డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల మద్య వనప్రవేశం తర్వాత సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నేపల్లికి చేర్చారు. గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండకు తీసుకువెళ్లారు. నాలుగు రోజుల పాటు జరిగిన సమ్మక్క సారలమ్మ జాతర కుంభమేళాను తలపించింది.
గిరిజన సంప్రదాయ ప్రకారం సారలమ్మ రాకతో వైభవంగా జాతర ప్రారంభం అయ్యింది. దాదాపు 1.20 కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు భావిస్తున్నారు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ది చెందింది. మేడారం భక్తజనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని తరించిపోయారు. బంగారాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సల్లంగ చూడమంటూ మొక్కుకున్నారు.
మేడారం జాతరలో పోలీసుల అత్యుత్సాహం చూపారంటూ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ సంప్రదాయాలకు పోలీసులు అడ్డుతగిలారని వారు ఆరోపించారు.ప్రతిసారి సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య వన ప్రవేశం చేపించే పూజారులు పోలీసుల ప్రవర్తనతో పూజారులు ఇంకా గద్దెల వద్దకు రాలేదు. జిల్లా కలెక్టర్, ఎస్పీ బుజ్జగించడంతో ఎట్టకేలకు పూజారులు శాంతించారు.
జాతర చివరి రోజున కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా వనదేవతలను దర్శించుకుని..నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పిస్తామని అర్జున్ ముండా ప్రకటించారు. అర్జున్ ముండాకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ ఘనస్వాగతం పలికారు.
మేడారం జాతర విజయవంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తం చేసింది. అందరి సహాయ సహకారాలతో జాతర విజయవంతంగా నిర్వహించామని రాష్ర్ట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం దగ్గర శాశ్వత వసతి సదుపాయాలు నిర్మిస్తామని చెప్పారు.
చివరి రోజు వాన కురవడంతో మేడారం చుట్టుపక్కల జలమయం అయ్యింది. అయినా భక్తులు వెనక్కితగ్గకుండా వర్షపు నీటి మడుగులోనే తడుచుకుంటూ అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగిసినట్లు ప్రకటించడంతో భక్తులు ఇంటిబాట పట్టారు. జాతర బాగా సాగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. మేడారం రహదారుల భక్తుల రద్దీతో కిక్కిరిసి పోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత వనదేవతలు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.