Meat in Hanuman temple: శివ లింగం వద్ద మాంసం ముక్కలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత

Update: 2025-02-12 14:07 GMT

Meat in Hanuman temple: శివ లింగం వద్ద మాంసం ముక్కలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తత

హనుమాన్ మందిరంలోని శివ లింగం వద్ద మాంసం ముక్కలు పడి ఉన్న ఘటన బుధవారం హైదరాబాద్ పాతబస్తీలో కలకలం సృష్టించింది. టప్పచబుత్రలో జిర్ర హనుమాన్ ఆలయంలో బుధవారం ఉదయం భక్తులు పూజలు చేసేందుకు వచ్చారు. ఆలయంలోని శివ లింగం వద్ద మాంసం ముక్కలు పడి ఉండటం చూసి వారు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపి నేతలు, బీజేపి యువ మోర్చ నేతలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారికి స్థానికులు కూడా తోడయ్యారు. దాదాపు 50 మంది వరకు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

శివ లింగం వద్ద మాంసం గుర్తించినట్లు తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు శాంతించలేదు. పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసిన వారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నారు. ఈ ఘటనతో టప్పచబుత్ర ఆలయం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.

పోలీసులు ఏం చెబుతున్నారంటే...

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇది ఎవరైనా కావాలని చేసిన పనా లేకపోతే కుక్కలు, పిల్లులు లాంటిని నోట కర్చుకుని వచ్చి ఇక్కడ పడేశాయా అనేది విచారణలో తేలుతుందన్నారు. అంతేకాదు... మతిస్థిమితం సరిగ్గా లేని వారు కూడా ఇలా చేసే అవకాశం లేకపోలేదని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. అసలు వాస్తవం ఏదైనా దర్యాప్తులోనే తేలుతుందని, అప్పటి వరకు తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. 

Tags:    

Similar News