Man Harassed Women : దెయ్యం పట్టిందని బాలింతకు చిత్రహింసలు

Update: 2020-08-01 10:38 GMT
ప్రతీకాత్మక చిత్రం

Man Harassed Women : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా కొంత మంది ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యం పాలయినా, ఇంట్లో ఎదుగుదల లేకపోయినా, అనుకున్న పనులు జరగకపోయినా తమకు ఎవరో ఎదో మంత్రాలు చేస్తున్నారని, లేదా ఏదో దయ్యం పట్టి పీడిస్తుందని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలే ఎంతో మంది దొంగబాబాలను, భూతవైద్యులను సృష్టిస్తున్నాయి. ఆ దొంగ బాబాలు, భూతవైద్యులు తెలిసీ తెలియకుండా చేసే వైద్యంతో కొంత మంది ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఎప్పుడో అప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మరో సంఘటనే మంచిర్యాల జిల్లాలో తాజాగా వెలుగులోకి వచ్చింది.

వైద్యం పేరుతో భూతవైద్యుడు ఓ బాలింతకు నరకం చూపడంతో ఆ మహిళ ప్రాణాల మీదికి వచ్చింది.‌ ఆ భూతవైద్యుడు మహిళ తల వెంట్రుకలు లాగుతూ కొట్టడంతో బాలింత మహిళ అపస్మారక స్థితికి చేరింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యుడు మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ ఏడాది క్రితం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా 4 నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యంగా ఉండటంతో ఆమెకు దయ్యం పట్టిందని కుటుంబ సభ్యులు భూతవైద్యుడిని ఆశ్రయించారు.

ఆ భూత వైద్యున్ని స్వయాన రజిత మేనమామ కుందారంలోని రజిత అత్తవారింటికి తీసుకెళ్లి అక్కడ వైద్యం చేయించారు. ఆ తరువాత భూతవైద్యుడు పచ్చిబాలింత అయిన రజితను కొడుతూ దయ్యం వదిలిందా అంటూ నరకం చూపాడు. అలా దెబ్బలు తట్టుకోలేని రజిత చివరికి అపస్మారక స్థితికి చేరుకునే సమయానికి ఏదో చెబుతూ మంచంపై పడేశాడు. ఆ తరువాత కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినా, సైన్స్ పెరిగినా ఇంకా మూఢనమ్మకాలతో భూత వైద్యులను ఆశ్రయించి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.




Tags:    

Similar News