తెలంగాణలో తృణమూల్‌.. మమత చేస్తుందా హల్‌చల్‌?

Trinamool Congress: తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా?

Update: 2021-12-03 10:52 GMT

తెలంగాణలో తృణమూల్‌.. మమత చేస్తుందా హల్‌చల్‌?

Trinamool Congress: తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందా? దేశవ్యాప్తంగా విస్తరించే ఓ ప్రాంతీయ పార్టీ తెలంగాణను షేక్‌ చేయబోతోందా? టీఆర్ఎస్‌తో పాటు, ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు గాలం వేసే పని అప్పుడే మొదలైందా? ఇప్పటికే వైఎస్‌ షర్మిల నేతృత్వంలో పరుగులు పెడుతున్న వైటీపీకి దీటుగా మరో పార్టీ రాబోతోందన్న వార్తల్లో నిజమెంత? ఇంతకీ ఆ కొత్త పార్టీకి సారథ్యం వహించేది ఎవరు? ముందుకు నడిపించేది ఎవరు? రాజకీయవర్గాల్లో సాగుతున్న చర్చ ఏంటి?

మమత బెనర్జీ. బెంగాల్‌ కాళి. పశ్చిమ బెంగాల్‌ ఏకఛక్రాధిపత్యంగా శాసిస్తున్న ఫైర్‌బ్రాండ్‌ పొలిటికల్‌ లీడర్‌. మహామహా ఉద్దండ రాజకీయ పిండాలకు వణుకు పుట్టిస్తున్న బెంగాల్‌ టైగర్‌. ఆమె నేతృత్వంలో పురుడుపోసుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దీదీ పకడ్బందీ ప్లాన్‌ చేస్తున్నారట. ఇదే తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావానికి కారణం కాబోతోందన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

తెలంగాణలో అడుగుపెట్టే యోచనలో ఉన్న దీదీ తెలంగాణ రాష్ట్రంపై సీరియస్‌గానే దృష్టి పెట్టారట. ఇందులోభాగంగా కొద్దిమంది కాంగ్రెస్‌ కీలక నేతలతోపాటు టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలతో జాబితా రూపొందిస్తున్నట్టు సమాచారం. పార్టీని విస్తృతం చేసే బాధ్యతలను మమతా బెనర్జీ ఇటీవల కీలక నేతలకు అప్పగించారట. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, పార్టీల బలాలు, వాటి బలహీనతలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశించారట. ఇందులో భాగంగా కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బ్యాక్‌ఎండ్‌ వర్క్‌ చేస్తున్న ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్టు సమాచారం.

తెలంగాణలో పొలిటికల్ గ్యాప్ పుల్ ఫిల్ చేసేందుకు దీదీ తన పార్టీన వేదికగా ఇకపై చెలరేగడం ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు విశ్లేషకులు. అందులో భాగంగానే కాంగ్రెస్ అసంతృప్త నేతలకు గాలాలు వేస్తున్నారట. పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌ను తెలంగాణలో విస్తరింప చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిన దీదీ మణిపూర్‌, గోవా, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో పాతుకుపోయే ఏర్పాట్లు కూడా చేస్తోందట. తాను మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో అలకబూనిన నేతలే టార్గెట్‌గా దీదీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఫైమెన్‌ కమిటీ హైదరాబాద్‌లో ఇటీవల పర్యటించి కొందరి వివరాలను కూడా సేకరించిందట.

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కొందరు నేతలతో టీఎంసీ నేతలు చర్చించినట్లు సమాచారం. మాస్‌ ఫాలోయింగ్‌తో పాటు ఆర్థిక వనరులు బలంగా ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని టీఎంసీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న నేతలే టార్గెట్‌గా టీఎంసీ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కొండా వంటి నేతలతో పాటు తెలంగాణలో ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతల టార్గెట్‌గా తృణమూల్‌ కాంగ్రెస్‌ టీమ్‌ పనిచేస్తోందట. తృణమూల్‌ ఎంపీలు ఫ్రెండ్‌షిప్‌లో భాగమంటూ మాజీ, తాజా ఎంపీలను కలవడం తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపుతోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త కార్యవర్గం వచ్చాక, చాలా మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్లందరినీ మెయిన్ టార్గెట్‌గా టీఎంసీ టీమ్‌ ప్రయత్నాలు ప్రారంభించిందట. నిజానికి, గోవా, అస్సాం, త్రిపుర, హరియాణా, ఉత్తరప్రదేశ్, బిహార్, మేఘాలయా రాష్ట్రాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ వేగంగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న గోవా, యూపీ తదితర రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా దక్షిణాన తెలంగాణలో పార్టీ విస్తరణకు అవకాశాలున్నట్టు గుర్తించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

బీజేపీలోకి వెళ్తారని భావిస్తున్న కొంతమంది అధికార పార్టీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న దానిపై నివేదికలు రూపొందిస్తుందట. ఇటీవలి హుజురాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన ఓట్ల విషయంలో లోతైన అధ్యయనం చేసిన మమత ఓ నివేదికను తెప్పించుకుందట. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో పార్టీ విస్తరణపై మమతా బెనర్జీ దృష్టి సారించారన్నది ఆ పార్టీ నేతల మాట. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ ఇలా ఏ పార్టీ నేతలైనా కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆహ్వానిస్తామంటోంది. ఫైనల్‌‌గా ఓ మాట. అటు, ఆమ్‌ ఆద్మీలాంటి పార్టీలు తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మరీ బెంగాల్ సీఎం దీదీ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News