ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జలకళ.. పదకొండేళ్ళ తరువాత!

Update: 2020-09-23 06:17 GMT

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్ని జళకలను సంతరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండకుండలను తలపిస్తున్నాయి. ఈ వర్షాలు జిల్లా వాసులకు సంతోషాన్నిస్తున్నా అటు పంటలు నీట మునగడంతో అన్నదాతలను ఆందోళనకు గురిచేశాయి. వేలాది ఎకరాల్లో పంటలు, రోడ్లు దెబ్బతినడంతో అతి వృష్టి అనావృష్టి అన్న చందంగా మారింది ఉమ్మడి జిల్లా ప్రజల పరిస్థితి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 11 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులన్ని జలకళతో దర్శనమిస్తున్నాయి. కృష్ణా, తుంగబద్రా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటం, దానికి తోడు కొన్ని రోజులుగాలు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఐతే అటు అతి వృష్టి ఇటు అనావృష్టి అన్న చందంగా ఈ వానలు రైతన్నలను నట్టేట ముంచాయి. గత మూడు నెలలుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. పత్తి, జొన్న, కంది వేయాలన్న ప్రభుత్వ సూచన మేరకు ఆ పంటలనే సాగు చేసిన రైతన్నలు ఆదిలోనే నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, పత్తి, కంది, జొన్న లాంటి ఆరుతడి పంటలు నీట మునగడంతో రైతన్నలు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. అప్పుచేసి పండించిన పంటలు ఇప్పుడు వర్షార్పణమయ్యాయి. చేతి కొచ్చిన పంటలు కోతకు గురయ్యాయి.

ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 60% మేర కౌలు రైతులు పంటలు సాగు చేశారు. దీంతో ఇప్పుడు కురుసిన వర్షాలకు అదికంగా కౌలు రైతులు నష్టపోతున్నారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేని పరిస్థితుల్లో ఉంది. దీంతో పంటలు నష్టపోతున్న కౌలు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతంగం పరిస్థితి ఇలా ఉంటే వర్షాల కారణంగా ఆస్థి నష్టం కూడా బాగానే జరిగింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన ముసురు వర్షాలకు దాదాపు వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. ఈ వారం రోజుల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు కూలి ముగ్గురు మృతి చెందారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్థంబించాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. అడ్డకుల మండలం శాఖాపూర్ వద్ద 44వ జాతీయ రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలకు అంతారాయం ఏర్పడి బెంగుళూరు - హైద్రాబాద్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక పలు ప్రాంతాల్లోనూ బీటీ రోడ్లు సైతం కోతకు గురయ్యాయి. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అదికారులు హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షం వల్ల ఆస్థి పంట నష్టం ఇలా ఉంటే జిల్లా ప్రాజెక్టులు జళకలను సంతరించుకోవడం ప్రజల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. కల్వకుర్తి, కొయిల్ సాగర్, భీమా, నెట్టెంపాడు, సరళా సాగర్ లాంటి ప్రాజెక్టులు సైతం జల సిరులతో కళకలలాడుతున్నాయి.

Tags:    

Similar News