Sarpanch Elections: పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, ఫంక్షన్ హాల్ నిర్మాణం.. రూ.50 బాండ్‌ పేపర్‌పై హామీలిచ్చిన స్వతంత్ర అభ్యర్థి

Sarpanch Elections: తెలంగాణ స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీ ప్రచారం చేస్తున్నారు.

Update: 2025-12-09 09:49 GMT

Sarpanch Elections: తెలంగాణ స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పోటా పోటీ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. గ్రామంలో చేయబోయే పనులపై హామీ పత్రం ఇస్తున్నారు. పనులు చేయకపోతే రాజీనామా చేస్తామని చెబుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి గ్రామం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బుడిగె శృతి, అశోక్ దంపతులు టికెట్ ఆశించారు. కాంగ్రెస్ పార్టీ టికె‌ట్ వేరే వారికి కేటాయించింది. గ్రామంలోని యువత, స్నేహితుల సహకారంతో శృతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎన్నికల్లో మద్యం , డబ్బులు పంపిణీ చేయకుండా అందరికి ఉపయోగపడేలా మేనిఫెస్టోను రూపొందించారు.

సర్పంచ్‌గా గెలిచిన 24 గంటల్లో తనకు ఉన్న టెంట్ హౌస్‌ను గ్రామ పంచాయతీకి అందజేస్తామంటున్నారు. గ్రామంలో జరిగే పేద ఇంటి వివాహంతో పాటు మృతుల కుటుంబానికి 5వేల 116 ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత ఫంక్షన్‌హాల్ నిర్మాణం, గ్రంథాలయం ఏర్పాటు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రభుత్వ పాఠశాలలో ఏకరూప దుస్తులు అందిస్తామని 50రూపాయల బాండ్‌ పేపర్‌పై హామీలు రాసి ప్రచారం చేస్తున్నారు. ఈ హామీలను ఆరు నెలల్లో అమలు పరచనిపక్షంలో స్వచ్ఛందంగా రాజీనామా చేస్తామని చెబుతున్నారు.

సర్పంచ్ ఎన్నికలలో చిత్ర... విచిత్రాలు జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.గ్రామ ఓటర్లు ఈ ఉచిత హామీలకు జై కొడుతారా లేదో మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ గ్రామం సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్వగ్రామం కావడం విశేషం.

Tags:    

Similar News