నిజామాబాద్: కరోనా వైరస్ మరింత విస్తృతం కాకుండా నిరోధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో మే 7 వరకు లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా, కఠినంగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తి చైన్ ఎక్కడికక్కడ ఆగి పోయే విధంగా, వ్యాధి బారిన పడ్డ వారిని సురక్షితంగా ఇంటికి చేర్చే విధంగా వారి ద్వారా ఇంకొకరికి వ్యాప్తి జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో కఠినంగా నిబంధనలు అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఇంతవరకు ప్రజలు ప్రజా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తద్వారా జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న నిబంధనలను పాటిస్తున్న విధంగానే మే 7 వరకు కూడా కొనసాగించాలని ఆయన ప్రజలను కోరారు. తప్పనిసరైన నిత్యవసర వస్తువులు వైద్యపరమైన అత్యవసరాలకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఇంట్లో నుండి బయటకు వచ్చే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు.
బయట తిరిగినప్పుడు ఎక్కడైనా వ్యాధి తమకు అంటుకునే అవకాశం ఉంటుందనే అనుమానాన్ని ప్రతి చోటా గుర్తుంచుకొని జాగ్రత్తగా మసలుకోవాలని ఇంటికి వెళ్ళిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంటెన్ మెంట్ జోన్లలో ఉన్న ప్రజలు అధికారుల ఆదేశాలు పాటించాలని అక్కడి నుండి ప్రజలు బయటకు వెళ్లడం కానీ బయట ప్రజలు ఆ జోన్ లోకి రావడం కానీ ఖచ్చితంగా నిషేధించడం జరిగిందని, ఎవరైనా అతిక్రమిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని అన్నారు. అదే విధంగా అన్ని రకాల మత సంబంధమైన ప్రార్థనలను పూజలను ఇండ్లకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అందువల్ల ఎవరు కూడా ప్రార్థనా మందిరాల్లోకి లేదా దేవాలయంలోకి వెళ్లడం పూర్తిగా నిషేధించిందని దీనిని ఎవరు అతిక్రమించినా చర్యలకు కారకులు అవుతారని హెచ్చరించారు.
ఆన్లైన్ భోజనం, ఆహార పదార్థాలు సరఫరా చేయవద్దని పేర్కొన్నారు. ఇంటి పెద్దలు, తల్లులు, మహిళలు, వారి కుటుంబ సభ్యులను ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్లడాన్ని అడ్డుకోవాలని కోరారు. తద్వారా ఆ కుటుంబంలోని పెద్దమనుషులకు, పిల్లలకు ఈ వ్యాధి సంక్రమించకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుందని సూచించారు. జిల్లా ప్రజలందరూ మరికొద్ది రోజులు యంత్రాంగానికి సహకరించి జిల్లాలో ఈ వైరస్ ఇంతటితో ఆగి పోయే విధంగా తమ వంతుగా కృషిచేయాలని, అందరూ కూడా ఇండ్ల కే పరిమితం కావాలని తద్వారా అందరం కూడా సంతోషంగా ఉంటామని ఆయన ఆ ప్రకటనలో కోరారు.