హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్

* విమానాశ్రయం నుంచి గచ్చిబౌలీ వరకు.. ఔటర్ నుంచి శిల్పా లే అవుట్ వరకు అప్ అండ్ డౌన్ ర్యాంపుల నిర్మాణం

Update: 2022-11-25 01:16 GMT

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో ఫ్లై ఓవర్ 

Hyderabad: హైదరాబాద్‌ మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా వాహనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ కృషి చేస్తోంది. రవాణా సౌకర్యం, వాహన కాలుష్యాన్ని తగ్గించడం, సిగ్నల్‌ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగుపరిచి వాహనదారులు చేరుకోవాల్సిన గమ్యస్థానానికి సకాలంలో చేరడానికి ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ మీనాక్షి, ఐకియాలను కలుపుతూ 466 కోట్ల వ్యయంతో 1.75 కిలో మీటర్ల పొడవున చేపట్టిన శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మీదుగా ఈ ఫ్లై ఓవర్‌ ను నిర్మించారు.

అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు ఔటర్‌ రింగు రోడ్డు ద్వారా గచ్చిబౌలి వరకు ఎలాంటి సమస్యలు లేకుండా నేరుగా చేరుకున్నప్పటికీ అకడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అయితే శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్య తప్పనుంది. జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్‌ చెరువు, కోకాపేట్‌, నార్సింగ్‌తో పాటు శంషాబాద్ విమానాశ్రయం వెళ్లేందుకు ఒక మార్గం, అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మాదాపూర్‌ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ నుంచి గ్రేడ్‌ సపరేట్‌ మరొక ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని చేపట్టారు.

ఔటర్ నుంచి శిల్పా లే ఔట్ వరకు.. అప్ అండ్ డౌన్‌ ర్యాంపులను నిర్మించారు. ఔటర్ నుంచి శిల్పా లే అవుట్ వరకు అప్ ర్యాంపు ఫ్లై ఓవర్.. 456.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్ నుంచి ఔటర్ వరకు.. డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 399.95 మీటర్ల వెడల్పుతో రెండు ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి చేశారు. గచ్చిబౌలి నుంచి మైండ్ స్పేస్ వరకు 473 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో అప్ ర్యాంపు ఫ్లైఓవర్ నిర్మాణం కాగా.. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి వరకు డౌన్ ర్యాంపు ఫ్లై ఓవర్ 522 మీటర్ల పొడవు, 8.50 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేపట్టారు.

Tags:    

Similar News