ఏపీ సర్కారు నీరు తరలిస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు - కేటీఆర్
ఏపీ సర్కారు నీరు తరలిస్తున్న రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదు - కేటీఆర్
KTR About Telangana share in Krishna river water: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద రావాల్సిన నీటిని ఎపీ సర్కారు తన్నుకుపోతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇప్పటికే ఏపీ సర్కారు 646 టీఎంసీల నీటిని వాడుకుందన్నారు. సాగర్ కుడి కాలువ ద్వారా గత మూడు నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో జలాల తరలింపు జరుగుతోందన్నారు.
ఓవైపు ఏపీ కృష్ణజలాలను తరలిస్తుంటే మరోవైపు తెలంగాణ సర్కార్ చోద్యం చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల్లో సమాన న్యాయం కోసమని, కానీ రేవంత్ రెడ్డి సర్కారు ఆ లక్ష్యాన్ని పట్టించుకోవడం మానేసిందని అన్నారు.
కృష్ణా, గోదావరి నదుల నీటితో కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తే... కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే పొలాలను ఎండబెట్టిందన్నారు. రాబోయేది ఎండాకాలం అని తెలిసి కూడా నీటిని నిల్వ చేసే విషయంలో రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని కేటీఆర్ అన్నారు. ఎండా కాలంలో నీళ్లు లేకపోతే సాగునీరు, తాగు నీరు కష్టమవుతుందని గుర్తుచేశారు.
"ఒకవైపు కృష్ణా నది నుండి ఏపీ సర్కారు నీరు తరలిస్తుంటే... క్రిష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ లోని (KRMB) త్రీమెన్ కమిటీ పట్టించుకోవడం లేదు. తెలంగాణ సర్కారు కూడా నిర్లక్ష్యం చేస్తోంది" అని కేటీఆర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.