Khanapuram: వృద్ధ దంపతుల పట్ల మానవత్వాన్ని చాటుకున్న ఇన్స్పెక్టర్ గోపి
వైద్యానికి వచ్చిన ఇద్దరు దంపతులు పట్ల టూ టౌన్ ఇన్స్ పెక్టర్ గోపి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
బోనకల్: వైద్యానికి వచ్చిన ఇద్దరు దంపతులు పట్ల టూ టౌన్ ఇన్స్ పెక్టర్ గోపి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు గత కొన్ని రోజుల క్రితం వైద్యం కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. ఆస్పత్రి సిబ్బంది వారి ఆరోగ్యం కుదుట పడడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే వారి స్వ గ్రామానికి వెళ్దామంటే వాహన సౌకర్యాలు లేకపోవడం వల్ల సాయంత్రం వరకు ప్రధాన ఆసుపత్రి ముందే ఉన్నారు.
రాత్రివేళ కావడంతో స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్టాప్ వద్ద ఆకలితో అలమటిస్తూ... కటిక నేల పైన పడుకుని ఉన్నారు. పెట్రోలింగ్ లో భాగంగా అటుగా వచ్చిన గోపి వారి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. దీంతో వారికి ముందుగా భోజనం చేయించి ఆకలి తీర్చాడు. అనంతరం ఒక వాహనాన్ని ఏర్పాటు చేసి వారి స్వగ్రామానికి ఏర్పాట్లు చేశారు. వెళుతూ.. వెళుతూ.. ఆ వృద్ధ దంపతులు పోలీసులకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు.