IndiGo Flights Crisis: శంషాబాద్‌ విమానాశ్రయంలో అస్తవ్యస్తం – ప్రయాణికుల ఆగ్రహావేశాలు

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక్కసారిగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీగా విమానాలను రద్దు చేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా అతలాకుతలమైంది.

Update: 2025-12-06 05:27 GMT

IndiGo Flights Crisis: శంషాబాద్‌ విమానాశ్రయంలో అస్తవ్యస్తం – ప్రయాణికుల ఆగ్రహావేశాలు

హైదరాబాద్‌, శంషాబాద్‌: ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ఒక్కసారిగా, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా భారీగా విమానాలను రద్దు చేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయం శుక్రవారం పూర్తిగా అతలాకుతలమైంది.

ఒక్కరోజే 155 విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇందులో 84 విమానాలు శంషాబాద్‌ నుంచి బయలుదేరాల్సినవే కావడం మరింత గందరగోళానికి కారణమైంది.

ఆన్‌లైన్‌లో సాధారణంగా, గ్రౌండ్‌లో గందరగోళం

ఆన్‌లైన్‌ స్టేటస్‌లో విమానాలు యథావిధిగా నడుస్తున్నట్లు కనిపించగా, విమానాశ్రయంలో మాత్రం పూర్తిగా భిన్న దృశ్యం. చెకిన్‌ పూర్తయ్యాకే సర్వీసులు రద్దు చేసినట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆవేశంతో ధర్నాకు దిగారు.

రిఫండ్‌, రీషెడ్యూల్‌ కోసం ఇండిగో కౌంటర్ల వద్ద పెద్ద క్యూలు ఏర్పడ్డాయి.

సీట్లు లేవు, నేలపైనే కూర్చోవాల్సిన పరిస్థితి

విమానాశ్రయంలో తగిన సీట్లు లేక చాలామంది నేలపైనే కూర్చున్నారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారు ఇతర విమానయాన సంస్థల వద్ద టికెట్లు తీసుకోవడానికి ప్రయత్నించగా, ధరలు రెట్టింపుకంటే ఎక్కువయ్యాయి.

భక్తుల ఆందోళన – నాలుగో రోజూ Hyderabad–Kochi ఫ్లైట్ రద్దు

హైదరాబాద్‌–కోచి విమానం వరుసగా నాలుగో రోజూ రద్దు కావడంతో శబరిమలై భక్తులు తెల్లవారుజామునే నిరసన వ్యక్తం చేశారు.

మంత్రి జోక్యం – ప్రత్యేక విమానం ఏర్పాటు

శంషాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఈ గందరగోళంలో పడ్డారు. సమాచారం అందడంతో ఆయన తక్షణమే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. అనంతరం రోడ్‌ మార్గం ద్వారా ప్రయాణం కొనసాగించారు.

అదే సమయంలో, ఈ నెల 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమిట్‌కు రావాల్సిన అతిథులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.

చంటి పిల్లలు, గర్భిణుల‌కు తీవ్రమైన అవస్థలు

ఇండిగో అధికారుల–సిబ్బంది మధ్య సమన్వయ లోపం కారణంగా

6,000 మందికి పైగా ప్రయాణికులు రాత్రంతా టెర్మినల్‌లోనే తింటూ–నిద్రిస్తూ గడపాల్సి వచ్చింది.

చెకిన్‌ పూర్తయ్యాక గంటల తరబడి “రీషెడ్యూల్‌ చేస్తాం” అని చెప్పి, చివరికి 10–12 గంటల తర్వాత సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహంతో కౌంటర్ల వద్దకు పరుగెత్తారు.

చంటి పిల్లలతో వచ్చిన తల్లులు, గర్భిణులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ఉద్రిక్తత పెరగడంతో కొందరు సిబ్బందిపై దాడికి కూడా యత్నించగా, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.

లగేజీ కలకలం

చెకిన్‌ పూర్తయిన ప్రయాణికుల సామాను ఇప్పటికే విమానాల్లోకి పంపించేసినా, సర్వీసులు రద్దయిన తర్వాత కూడా లగేజీ ఇవ్వడానికి ఇండిగో సిబ్బంది నిరాకరించారు.

“మా సామానుకు మీరు బాధ్యత వహిస్తున్నట్టు లిఖితపూర్వకంగా ఇవ్వాలి” అన్న ప్రయాణికుల డిమాండ్‌పై, రాత్రి 10 గంటల తర్వాత ఇస్తామని ఇండిగో తెలిపింది.

అదే సమయంలో, శనివారం కూడా పలు ఇండిగో ఫ్లైట్‌లు రద్దు అయ్యే అవకాశం ఉంది అని అధికారులు పేర్కొన్నారు.

Tags:    

Similar News