Oxygen: తెలంగాణలో విపరీతంగా పెరిగిపోయిన ఆక్సిజన్‌ అవసరం

Oxygen: రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుడటంతో ఆక్సిజన్‌ అవసరం విపరీతంగా పెరిగిపోయింది

Update: 2021-04-25 02:13 GMT

ఆక్సిజన్ టాంకులు (ఫైల్ ఇమేజ్)

Oxygen: రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుడటంతో ఆక్సిజన్‌ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. కేవలం 10 గంటల్లోనే కరోనా బాధితుల్లో 785 మందికి ఆక్సిజన్‌, 185 మందికి ఐసీయూ చికిత్సలు అవసరమయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిమిషానికి 1.3 మంది చొప్పున గంటకు 78.5 మందికి ప్రాణవాయువుతో వైద్యం చేయాల్సి వచ్చింది. సకాలంలో వైద్యం అందక, పరిస్థితి విషమించటంతో 185 మందికి ఐసీయూలో చికిత్స తప్పనిసరి అయ్యింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్స్‌ ఆక్యుపెన్సీ, బాధితుల సంఖ్యను పరిశీలిస్తే కరోనా ఉద్ధృతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.

రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. లక్షణాలు కనిపిస్తున్నా సకాలంలో టెస్ట్‌లు, చికిత్స పరంగా నిర్లక్ష్యం చేస్తున్న కొద్దీ, ఇతర వ్యాధులున్న బాధితుల పరిస్థితి తీవ్రమవుతోంది. వారిలో 30 శాతం మందికి ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సి వస్తోంది. ఆక్సిజన్‌పై చేరికలు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 18వేల, 506 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. తొలిదశ, రెండోదశకు ముందుగా ఆసుపత్రి చికిత్సలు తక్కువగానే ఉన్నా, వైరస్‌ వ్యాప్తి పెచ్చుమీరటంతో పరిస్థితి చేయిదాటుతోంది. ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా కొందరికి ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో పరిస్థితి తీవ్రమవుతోంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తడంతో ఆక్సిజన్‌ కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులెట్టాల్సి వస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో చేరికలు పెరగడంతో కొన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్స్‌ నిండుకున్నాయి. ప్రైవేటులో మరిన్ని వైద్య కేంద్రాలకు అనుమతులిస్తూ పడకల స్థాయి పెంచుతున్నా ఆక్యుపెన్సీ రేటూ అదే మాదిరి ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

గత రెండు వారాలుగా కేసులు తీవ్రం కావడంతో ఆసుపత్రుల్లో చేరేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. తొలుత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉన్నా ఇటీవల రెండింతలకు పైగా పెరిగింది. ఏప్రిల్‌ పది నాటికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలపై 1090 మంది ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3వేల136కి చేరింది. ఐసీయూ పడకలపై 328 మంది ఉంటే ఇపుడు బాధితుల సంఖ్య 1246కి పెరిగింది. శనివారం ఒక్కరోజునే ఉదయం పది నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి సాధారణ, ఆక్సిజన్‌, ఐసీయూ పడకల్లో వెయ్యి మంది చేరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలపై కొత్త చేరికల సంఖ్య 428గా నమోదైంది. ఐసీయూ పడకల్లో చేరికలు 67గా ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ చికిత్సకు మరిన్ని దవాఖానాలను అనుమతిస్తోంది. మౌలిక సదుపాయాలను పరిశీలించి అనుమతులు ఇవ్వగా రెండువారాల క్రితం ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న ఆక్సిజన్‌ పడకలు 4వేల171 నుంచి శనివారానికి 10వేల20కి పెరిగాయి. ఐసీయూ పడకలు 3331 నుంచి 6735కి చేరాయి.

Tags:    

Similar News