Dalita Bandhu: ఇవాళ దళితబంధు అమలుపై సన్నాహక సమావేశం
Dalita Bandhu: హుజూరాబాద్‌తో పాటు మరో 4 మండలాలు ఎంపిక * పథకం అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ చర్చ
సీఎం కెసిఆర్ (ఫోటో: ది హన్స్ ఇండియా)
Dalita Bandhu: దళిత బంధు పథకం అమలుపై ప్రగతిభవన్‌లో ఇవాళ సన్నాహక సమావేశం జరుగనుంది. రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలు చేయనున్నారు. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండలో పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నాగర్‌కర్నూలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిరంజన్‌రెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జెడ్పీ చైర్ పర్సన్ పద్మావతి, కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ హాజరుకానున్నారు.
సీఎం కేసీఆర్ నిర్వహించనున్న దళిత బంధు సమీక్షా సమావేశానికి హాజరవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలనే డిమాండ్‌ను సీఎం ముందు వినిపించాలని తీర్మానించింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ నేత భట్టి, పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దళిత బంధు అమలుకు ఎంపిక చేసిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ ఆహ్వానించారు.
మధిర నియోజకవర్గంలో కూడా దళిత బంధు అమలుకు శ్రీకారం చుట్టారు. అక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎమ్మెల్యేగా వున్నారు. సీఎం సమీక్షా సమావేశానికి భట్టి వెళ్లాలా వద్దా అన్న దానిపై టీపీసీసీ సమావేశంలో చర్చించారు. దళిత బంధును ఒక్క నియోజకవర్గానికే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే అనే డిమాండ్‌ను సీఎం ముందు వుంచాలని సీఎల్పీ నేత భట్టికి సూచించింది కాంగ్రెస్ పార్టీ.