100 కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్.. దశరథ రామయ్యపై కేసు నమోదు
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 100 కోట్లు విలువచేసే లక్ష గజాల భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేయాలని చూశారు కొందరు. స్థానిక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, బ్యాంక్ ఉద్యోగి సహా పలువురి పేర్లపై నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్‌తో అబ్దుల్లాపూర్‌మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌కు పన్నాగం పన్నారు. బాటసింగారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 376లో 223 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ భారీ వెంచర్ నిర్మాణం చేపట్టింది.
అయితే.. ప్రజల అవసరాల కోసం శ్రీమిత్ర డెవలపర్స్ లక్ష గజాల భూమిని వదిలేయగా.. ఆ భూమిని శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్య అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా కాజేయాలని చూశారు. నకిలీ ఆర్డీవో ప్రొసీడింగ్ అని తేల్చిన అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ అధికారులు.. భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో.. శ్రీమిత్ర డెవలపర్స్ డైరెక్టర్ దశరథ రామయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అక్రమ రిజిస్ట్రేషన్‌కు ప్లాన్ చేసిన స్థానిక బీఆర్‌ఎస్ నేతలతో పాటు బ్యాంక్ ఉద్యోగిని గుర్తించారు.