Huzurabad Bypoll: తెలంగాణలో హీట్‌ పుట్టిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక

Huzurabad Bypoll 2021: అధికార, విపక్షాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం...

Update: 2021-10-24 03:50 GMT

Huzurabad Bypoll: తెలంగాణలో హీట్‌ పుట్టిస్తున్న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక 

Huzurabad Bypoll 2021: తెలంగాణలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక హీట్‌ పుట్టిస్తోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తుంది. అధికార పార్టీ టీఆర్ఎస్‌.. విపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయగా.. కాంగ్రెస్‌, బీజేపీలు ధీటుగా సమాధానం చెప్పడంతో రాష్ట్రంలో మరోసారి రాజకీయం వేడెక్కింది.

మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. రేవంత్, ఈటల రహస్యంగా కలిశారని.. తన దగ్గర ఆధారాలున్నాయన్నారు కేటీఆర్. గాంధీభవన్‌లోకి గాడ్సేలు దూరారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా పరిధి అతిక్రమించిందన్నారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటలను తాను బహిరంగంగానే కలిశానని స్పష్టం చేశారు. అంతేకాదు కేసీఆర్ కుట్రలను తనతో ఈటల చెప్పారన్నారు. కిషన్ రెడ్డితో ఈటల భేటీని ఏర్పాటు చేసింది కేసీఆర్, కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

ఇక బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్‌ ఎందుకు పనిచేస్తుందని ప్రశ్నించారు భట్టి విక్రమార్క. హుజూరాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్యే లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు భట్టి విక్రమార్క.

మంత్రి కేటీఆర్ కామెంట్స్‌కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గుర్తించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ కలిసి పోయాయని మాట్లాడుతున్నారన్నారు. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేయలేదని గుర్తుంచుకోవాలన్నారు.

కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని మాత్రమే కాదు.. సీపీఐ, సీపీఎం పార్టీ నేతలను కూడా కలిసినట్లు చెప్పారు హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌. కాంగ్రెస్‌లో ఏమైనా నిషేధిత నేతలున్నారా కలవకుండ ఉండటానికి అంటూ ఈటల ప్రశ్నించారు.

Tags:    

Similar News