Rains: హైదరాబాద్‌లో రాత్రి కుండపోత వర్షం

Rains: రెండు గంటల పాటు నగర వ్యాప్తంగా దంచికొట్టిన వాన

Update: 2021-09-26 02:31 GMT

హైదరాబాద్ లో రాత్రి కుండపోత వర్షం (ఫైల్ ఇమేజ్)

Rains: హైదరాబాద్‌లో రాత్రి కుండపోత వర్షం కురిసింది. రెండు గంటల పాటు నగర వ్యాప్తంగా వర్షం దంచికొట్టడంతో జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. పలు కాలనీల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రెండు గంటల పాటు కుండపోతగా కురిసింది. ప్రధాన రహదారులకు వరద పోటెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్తలు పడుతున్నారు.

బంగాళాఖాతంలో తుపాన్‌గా మారిన వాయుగుండం, మరో 24 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ఖమ్మం, మహబుబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

గులాబ్‌ ఇవాళ సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో ఒడిసా, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు, సోమవారం ఈశాన్య, తూర్పు బంగళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని, దాని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 24 గంటల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది. 

Tags:    

Similar News