తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం తీవ్రంగా అస్తవ్యస్తమైంది. నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, రవాణా వ్యవస్థ అంతరాయానికి గురైంది.
ఈ పరిస్థితుల్లో కరీంనగర్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, ఆదిలాబాద్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు నేడు (గురువారం) సెలవు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో సెలవు రోజుకు ప్రతిగా వచ్చే నెల రెండో శనివారాన్ని పనిచేయు దినంగా ప్రకటించారు. జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పాఠశాలలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆదిలాబాద్‌లో పరిస్థితి తీవ్రం – ప్రజలు ఇంట్లోనే ఉండండి: కలెక్టర్ సూచన
ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వర్ష బీభత్సానికి చెట్లు విరిగిపడటం, విద్యుత్ తీగలు తెగిపోవడం, వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. భీంపూర్, తాంసి మండలాల్లోని 50 గ్రామాలకు బుధవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రాకూడదని ఆదిలాబాద్ కలెక్టర్ హెచ్చరించారు. రహదారులపై వరద నీరు చేరడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలందరికీ సూచనలు:
అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు
విద్యుత్ తీగలు తెగిన చోట దూరంగా ఉండండి
అధికారుల సూచనలు పాటించండి
ఎమర్జెన్సీ సమయంలో హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోండి