Hyderabad Rain: హైదరాబాద్ లో అర్థరాత్రి నుంచి భారీ వర్షం..

Hyderabad Rain: భాగ్యనగరం తడిసి ముద్దౌతోంది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Update: 2021-04-14 01:42 GMT

Hyderabad Rain:(File Image)

Hyderabad Rain: భాగ్య నగరం తడిసి ముద్దౌతోంది. హైదరాబాద్ లో గత అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. ఆ తర్వాత నెమ్మదిగా మొదలైన వర్షం రాత్రి నుంచి కురుస్తూనే ఉంది. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మియాపూర్, చందానగర్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, బోరబండ, రహమత్‌నగర్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మణికొండ, మెహదీపట్నం, పంజాగుట్ట, బేగంపేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్, తిరుమలగిరి, తార్నాక, మెట్టుగూడ, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్, బంజారా‌హిల్స్ ఫిలింనగర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది.

అకాల వర్షంతో హైదరాబాద్‌ వాసులు ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. నగరంలోని అనేక రహదారులు జలమయ్యాయి. కొన్ని చోట్ల రోడ్ల మీద మోకాలు లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు, అంబర్‌పేట్‌, నారాయణగూడ, నాంపల్లి, ఎల్బీ నగర్‌ వనస్థలిపురంలోనూ భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జీహెచ్ఎంసీ డిజాస్టర్ బృందాలు రంగంలోకి దిగాయి. అయితే వేసవి నేపథ్యంలో ఎండవేడిమితో సతమతమవుతోన్న నగరవాసులకు ఈ వర్షంతో కాసింత ఉపశమనం లభించింది. 

Tags:    

Similar News