మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చూట్టిన జీహెచ్‌ఎంసీ

Update: 2019-11-15 16:28 GMT
GHMC

హైదరాబాద్‌లో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జీహెచ్‌ఎంసీ. మొన్నటి వరకు ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులను సేకరించిన బల్దియా ఇప్పుడు పరిసరాల్లో పడేసిన భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని డిసైడ్ అయింది. ఇందుకోసం పదిరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్‌ భవనాలు నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. వాటితో పాటే భవన నిర్మాణ వ్యర్ధాలు ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. రోడ్ల వెంట నిర్మాణ వ్యర్ధాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కనీసం 400 మెట్రిక్ టన్నులకు పైగా భవన నిర్మాణ వ్యర్ధాలు వస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

భవన నిర్మాణ వ్యర్ధాలపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టింది. సిటీలో బహిరంగ స్థలాలు, రహదారులు, చెరువుల వెంట ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను తొలగించేందుకు ఈనెల 20 నుండి 29 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మేయర్ బొంతు రాంమోహన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సర్కిల్‌లో భవన నిర్మాణ వ్యర్ధాలను డిపాజిట్ చేసేందుకు ప్రత్యేకంగా ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో కింది స్థాయి సిబ్బంది నుండి అధికారుల వరకు పాల్గొని నిర్మాణ వ్యర్థాలను సేకరించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేయర్ సూచించారు.

భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు 12 కోట్లతో జీడిమెట్లలో ప్రత్యేకంగా రీసైక్లింగ్ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది జీహెచ్‌ఎంసీ. త్వరలోనే ఈ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. ప్లాంట్ అందుబాటులోకి వస్తే నగరంలో తీవ్ర సమస్యగా మారిన భవన నిర్మాణ వ్యర్ధాల తొలగింపు మార్గం సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

keywords : GHMC,Hyderabad,Greater,Roads

Tags:    

Similar News