కన్నుల పండగగా గంగాపూర్ శ్రీ బాలాజి వెంకటేశ్వర స్వామి జాతర
తెలంగాణ తిరుమలగా పేరు గాంచిన గంగాపూర్ శ్రీ బాలాజి వేంకటేశ్వర స్వామి జాతర మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది.
తెలంగాణ తిరుమలగా పేరు గాంచిన గంగాపూర్ శ్రీ బాలాజి వేంకటేశ్వర స్వామి జాతర మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య జరిగే జాతర ప్రతి ఏడాది ఏడాది మాఘపౌర్ణమి రోజున నిర్వహిస్తుంటారు. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి వారి మొక్కలు తీర్చుకుంటారు. ఇక్కడి బాలాజి స్వామి వారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నట్టే అని అక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.
ఈ జాతరలో మరో విశిష్టత ఏంటంటే ప్రతి ఏడాది మాఘపౌర్ణమి రోజున ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కాసేపు మూసివేస్తారని ఆలయ అర్చకులు చెపుతున్నారు. ఆ సమయంలో వేంటకేశ్వర స్వామివారు గంగాపూర్ లో భక్తులకు దర్శనం ఇస్తారని భక్తుల నమ్మకం. ఈ రోజున ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని కోరికలను కోరితే మరుసటి ఏడాదిలో జరిగే జాతర సమయం వరకు అవి తీరుతాయని చెపుతుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కన రాష్ట్రాల నుంచి కూడా దండోపతండాలుగా భక్తులు ఇక్కడి చేరుకుంటారు.
బాలజీ ఆలయ క్షేత్రం చరిత్ర:
రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామపోలిమేరలో ఉన్న గుట్టపై శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని16వ శతాబ్దానికి ముందు గంగాపూర్ కు చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పొతజీ నిర్మించినట్లు చరిత్ర చెపుతుంది. పొతాజీ చిన్నతనం నుంచే శ్రీ బాలాజి వెంకటేశ్వరస్వామి భక్తిడు. ఈయన ప్రతి ఏటా మాఘపౌర్ణమి వచ్చేనాటికి కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునే వారని చెపుతుంటారు.
తన చిన్నతనం నుంచి ప్రతి ఏటా తిరుమలకు గంగాపూర్ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లేవారని ఆలయ అర్చకులు చెపుతున్నారు. ఆ తరువాత కొంత కాలానికి ముమ్మడి పోతాజీ వయస్సు పైబడి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తిరుమలకు వెళ్లలేక తనలోతానే మనోవేదనకు గురయ్యారని తెలిపారు. అలా ఉన్న సమయంలో ఒక రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి పొతాజీ కలలో కనిపించి తిరుమలకు రానందుకు నీవు చింతించకు, నీలాంటి భక్తుల కోసం నేనే నీ వద్దకు వస్తాను అని తెలిపారట. ఇందుకోసం గంగాపూర్ పోలిమేర లోని గుట్టబాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ద పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పారని అంటుంటారు.
దీంతో పోతాజి గంగాపూర్ ను ఆను కొని ఉన్న వాగు సమీపంలో గుట్టను తొలవడం మొదలు పెట్టాడట. మొదటగా తవ్విన చోట గోవిందాజ స్వామి వారి ఆనవాలు దర్శనమిచ్చాయట, దాంతో మరో ప్రయత్నం చేయగా అక్కడ శివాలయం ఏర్పడిందట, చివరి ప్రయత్నంగా కొండమీద మరో వైపున తొలవగా అక్కడ స్వామి వారి తిరునామాలు దర్శనమిచ్చాయని, దాంతో అక్కడే శ్రీ బాలాజి వెంకటేశ్వరస్వామి వారి ఆలయం నిర్మించారని చెపుతుంటారు.
ఈ ఆలయ ప్రాంగణంలో బాలాజితో పాటు గోవింద రాజ స్వామి, శివుడు, హనుమంతుడు దర్శనం ఇవ్వడం విశేషం. అంతే కాక ఈ ఆలయ ప్రాంగణంలోనే కోనేరును కూడా నిర్మించారు. ఇక పోతే ఆలయాన్ని నిర్మించిన పోతాజి మరణానంతరం ఆయన సమాధిని ఆలయ ముందు భాగంలో నిర్మించారు. ఆయన తదనంతరం ప్రతి ఏటా ఈ జాతరను క్రమం తప్పకుండా ఆ గ్రామ ప్రజలు చేస్తుంటారు. జాతరలో మొదటి రోజున స్వామి వారి కళ్యానోత్సం, రెండో రోజున రథోత్సవం, మూడో రోజున నాగవెళ్లి జరపుతుంటారు.
ఆలయానికి ఈ విధంగా చేరుకోవచ్చు..
రైలు మార్గం ద్వారా కాని, బస్సు మార్గం ద్వారా కాని వెళ్లిన వారు రెబ్బన అనే గ్రామంలో దిగి, అక్కడి నుంచి 3కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆటో ద్వారా చేరుకోవచ్చు.