Free Coronavirus Test in GHMC: హైదరాబాద్‌లో ఉచిత కరోనా పరీక్షలు పున:ప్రారంభం..

Update: 2020-06-30 12:20 GMT
ప్రతీకాత్మక చిత్రం

Free coronavirus test in GHMC: దరాబాద్‌ నగర పరిధిలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు ఉచితంగా చేయడం మళ్లీ ప్రారంభించారు. మంగళవారం నుంచి కరోనా పరీక్షల కోసం అనుమానితుల నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే మెహెదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రి, నేచర్‌ క్యూర్‌, ఆయుర్వేదిక్‌ హాస్పిటల్‌, చార్మినార్‌‌లోని నిజామియా ఆస్పత్రుల్లో ఒక్కో కేంద్రంలో రోజుకు కనీసం 250 నమూనాలు సేకరించాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అంతే కాకుండా రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్‌ యూపీహెచ్‌సీ, మహేశ్వరం సీహెచ్‌సీ, కొండాపూర్‌ ఏరియా ఆసుపత్రి, వనస్థలిపురం ప్రాంతీయ ఆసుపత్రులలో రోజుకు కనీసం 150 శాంపిల్స్‌ చొప్పున సేకరించి పరీక్షించాలని నిర్ణయించారు.

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో 50 వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో గత 10 రోజుల నుంచి తెలంగాణలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచిన సంగతి తెలిసిందే. అంటే ఈనెల 16 నుంచి 9 రోజుల పాటు దాదాపు 36 వేల నమూనాలు సేకరించారు. ఒక్క సారిగా కరోనా సాంపిల్స్ ఎక్కువగా రావడంతో కరోనా పరీక్ష చేసే ల్యాబ్‌లు రోజంతా పని చేసినా, సేకరించిన అన్ని నమూనాలను పరీక్షించలేని స్థితి ఏర్పడింది. దీంతో రెండోజుల పాటు శాంపిళ్ల సేకరణను తాత్కాలికంగా నిలిపివేసారు. ఇక నిన్నటికి పెండింగ్‌లో ఉన్న శాంపిల్ పరీక్షలు పూర్తికావడంతో మళ్లీ కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి నమూనాలను సేకరిస్తున్నారు.

తెలంగాణలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే..నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 975 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,394 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9559 యాక్టివ్ కేసులు ఉండగా, కరోనా నుంచి 5582 మంది కోలుకున్నారు. ఇక నిన్న 410 మంది డిశ్చార్జ్ కాగా, ఆరుగురు మృతి చెందారు. నిన్న నమోదైన కేసులలో ఒక్క GHMC పరిధిలోనే 861 కేసులు ఉన్నాయి. ఇక రంగారెడ్డిలో 40, మేడ్చెల్ లో 20, సంగారెడ్డిలో 14, కరీంనగర్ లో 10, మహబూబ్ నగర్ లో మూడు, భద్రాద్రి 8, వరంగల్ అర్బన్ లో 4 , వరంగల్ రూరుల్ 5 , నల్గొండ, కామారెడ్డిలో రెండేసి కేసులు, ఇక సిద్దిపేట, గద్వాల్, మహబూబాబాద్, ఆసిఫాబాద్ లలో ఒక్కో కేసు నమోదు అయింది.

Tags:    

Similar News