ధిక్కారమా... అనురాగమా.. ఆలింగనం వెనుక అసలు రహస్యం

Etela Rajender: ఈటలను కేకే ఎందుకు ఆలింగనం చేసుకున్నారు.?

Update: 2021-12-17 14:30 GMT

ధిక్కారమా... అనురాగమా.. ఆలింగనం వెనుక అసలు రహస్యం

Etela Rajendar: ఈటలను కేకే ఎందుకు ఆలింగనం చేసుకున్నారు.? అధినేత కాదని పక్కకు తప్పించిన రాజేందర్‌ను భుజం మీద చేయి వేసి మరీ కేకే ఎందుకు దగ్గరకు తీసుకున్నారు? ఇది దళపతిని ఎదురించిన ధిక్కారమా? పాత జ్ఞాపకాల ఆత్మీయ అనురాగమా? కమలం క్యాంప్‌లో జరుగుతున్న చర్చేంటి? గులాబీ టీమ్‌లో జరుగుతున్న రచ్చేంటి?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకొనే పాలక, ప్రతిపక్ష సభ్యులు అది సభ వరకే పరిమితం అనుకుంటారు. బయటకు వచ్చిన తరువాత ఆప్యాయంగా పలకరించుకుంటారు. మనసు విప్పి మాట్లాడుకుంటారు. కానీ ఒక్కోసారి తమ పార్టీ నాయకులు ప్రత్యర్ధులతో మాట్లాడితే, అదీ తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారితో సన్నిహితంగా ఉంటే ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు వినిపిస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఇన్సిడెంటే ఒకటి ఆదివారం కనిపించింది. చర్చనీయాంశమైంది.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి, ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి, ఉద్యమకారుడిగా వాక్బాణాలు విసిరి, తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఈటల రాజేందర్‌ను కారణాలు ఏవైనా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేశారు అధినేత. దీంతో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన ఈటల టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా హుజూరాబాద్‌లో సంచలన విజయం నమోదు చేశారు. తన సత్తా ఏమిటో చూపించారు. ఇంతవరకు బాగానే ఉంది...!!

కానీ, తాజాగా ఒకప్పటి ఆత్మీయులు, రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్న టీఆర్ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొడుకు పెళ్లిలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కోమటిరెడ్డి కొడుకు పెళ్లికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు హజరయ్యారు. సహజంగానే వేరు వేరు పార్టీల నాయకులై అయినా, రాజకీయాలకు అతీతంగా ఒకచోట కలసినప్పుడు పరస్పరం పలకరించుకుంటారు, షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ఆప్యాయతను చాటుకుంటారు. కాకపోతే, ఇక్కడ విశేషం ఏంటంటే కేకే, తన ప్రత్యర్థి అయిన బీజేపీ ఎమ్మెల్యే ఈటలను పలకరించడంతో పాటు ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. దీంతో అక్కడ ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యారట. కొందరు ఈ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్‌లో క్లిక్ మనిపించారు. ఇవే ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయ్యాయి.

హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల గెలిచిన తర్వాత నుంచి ఆయనకు టీఆర్‌ఎస్‌ నేతలు దాదాపు దూరం దూరంగానే ఉంటున్నారు. మాట్లాడటం అటు ఉంచితే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో ఈటల ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్నవారు కూడా బాస్ ఏమనుకుంటాడో అని ఈటలతో డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న కే కేశవరావు ఇలా ఈటల‌ను ఆప్యాయంగా కౌగిలించుకోవడం, పలకరించుకోవడంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో కొన్ని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది.

ఈటల మీద చెయ్యి వేసిన కేకే ప్రేమగా కాసేపు మాట్లాడారు. ఇద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది. కేకే తన మాస్క్‌తో ఈటలను సరదాగా కొట్టడం అక్కడి వారిలో నవ్వులు పూయించింది. అయితే ఈటల, కేకేల మధ్య అప్యాయ పలకరింపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా టీఆర్‌ఎస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో వారి మధ్య ఉన్న చనువుతోనే కేకే ఈటలను అప్యాయంగా పలకరించి ఉంటారని, అంతకు మించి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈటల వివాహ వేడుకకు ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే మంత్రి కేటీఆర్ కూడా అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఈటలతో పలువురు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అయితే అటుగా వచ్చిన మంత్రి కేటీఆర్ ఈటలకు కొద్ది దూరంగా పక్క నుంచి చాలా ఫాస్ట్‌గా ముందుకు కదిలారు. ఏమైనా కేకే, ఈటల ఆప్యాయ కౌగిలింపు యాదృశ్చికంగానే జరిగినా ఈ ఘటనపై టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.!!

Tags:    

Similar News