Telangana Elections: ఓట్ల పండగలో నోట్ల జాతర.. తెలంగాణ వ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్న నగదు
Telangana Elections: గుట్టలు.. గుట్టలుగా నోట్ల కట్టల వెలికితీత
Telangana Elections: ఓట్ల పండగలో నోట్ల జాతర.. తెలంగాణ వ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్న నగదు
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగదు, బంగారం భారీగా పట్టుబడుతున్నాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేని నగదు, బంగారాన్ని అక్కడికక్కడే సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ చందానగర్‌లో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులకు భారీగా బంగారం పట్టుబడింది. సుమారు 29 కేజీల బంగారంతో పాటు.. 26 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు మాదాపూర్ SOT పోలీసులు. సరైన పత్రాలు చూపించకపోవడంతో బంగారం, వెండి ఆభరణాలను సీజ్ చేశారు. చందానగర్ పరిధిలో ఉన్న జ్యువెలరీ షాపులకు సంబంధించిన బంగారం, వెండి ఆభరణాలుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు, కేరళకు వ్యానులో ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు వివరాలు సేకరించారు. పట్టుబడ్డ బంగారు ఆభరణాలను ఐటీ అధికారులకు అప్పగించారు చందానగర్ పోలీసులు.
అటు.. తెలంగాణ జిల్లాల్లోనూ డబ్బు పట్టుబడుతోంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బైక్‌లో తరలిస్తున్న లక్షా 70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ప్రజలు 50 వేల రూపాయల కంటే ఎక్కువ నగదును తమ వెంట తీసుకువెళ్లరాదని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం పట్టుబడ్డ నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్‌కు అప్పగించారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని జక్కన్నపల్లి పెట్రోల్ బంక్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఈ సోదాల్లో 2లక్షల 55వేల 3వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల నుంచి వేరు వేరుగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆ డబ్బులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. అనంతరం.. సీజ్ చేయబడ్డ డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌కు అప్పగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సులు, కార్లతో పాటు.. పలు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేశారు పోలీసులు. సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 6 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు కొత్తగూడెం టూటౌన్ పోలీసులు. సీజ్ చేయబడ్డ డబ్బును ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌కు అందజేశారు.
ఎన్నికల సందర్భంగా సీజ్ చేసిన నగదుపై ఈసీ ప్రకటన చేసింది. 8 వందల 42 మంది టీమ్ సభ్యులతో వేర్వేరు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అధికారులు.. దాదాపు 100 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 8 రోజుల పాటు చేసిన తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు 101 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, బంగారం, వెండి.. అలాగే డ్రగ్స్ పట్టుబడినట్టు ఈసీ వెల్లడించింది. మొత్తం 8 రోజుల వాహన తనిఖీల్లో 55 కోట్ల 99 లక్షల, 26వేల 994 రూపాయల నగదు, 38 కోట్ల 45 లక్షల 44 వేల 526 రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, డైమండ్స్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 2 కోట్ల 60 లక్షల 57 వేల 4 రూపాయలు విలువ చేసే మద్యం సీసాలతో పాటు.. 3 కోట్ల 42 లక్షల 84 వేల 275 రూపాయలు విలువచేసే గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఇక.. 70 లక్షల 4వేల 500 రూపాయలు విలువైన చిన్న చిన్న ఐటెమ్స్ స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ప్రకటించింది.