హైదరాబాద్‌లో మళ్లీ భూప్రకంపనలు

Update: 2020-10-23 08:25 GMT

గత కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో తరచూ స్వల్పభూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో మరోసారి స్వల్పభూకంపం సంభవించింది. అయితే ఈ సారి ఎల్‌బినగర్‌ నియోజకవర్గంపై భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఎస్‌కెడీనగర్‌, బియన్‌రెడ్డినగర్‌, బియన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని హరిహరపురం, వైదేహినగర్‌ కాలనీల్లో భారీ శబ్దాలతో భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో 5.45 నిమిషాలకు భారీశబ్దంతో పలుసెకన్ల పాటు భూమి కంపించగా మరోమారు 6.40, 7.08 నిమిషాలకు కూడా మూడుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారీశబ్దాలతో భూమి కంపించడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రజలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఇక ఈ భూకంపం దాటికి కాలనీలోని ఓ ఇంటిపై కప్పు పెచ్చులూడటం, ఇండ్లలో ఉన్నటువంటి వస్తువులు చిందరవందరగా పడ్డాయి.

భూమికంపించడంతో ఆందోళన చెందిన ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనలతో ఎలాంటి ప్రమాదం లేదని జ్యువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ తివారి తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బియన్‌రెడ్డినగర్‌ కార్పొరేటర్‌ కాలనీల్లో పర్యటించి ప్రజలకు దైర్యం చెప్పారు. ఇప్పటికే వర్షాలతో బాధపడుతున్న ప్రజలకు మరోవైపు ఈ భూకంప వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో అధికారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని వారు తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాలతో అనేక కాలనీలు వరద ముప్పునకు గురైన విషయం తెలిసిందే. దీనికి తోడు పలుచోట్ల నగరంలో ప్రకంపనలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Tags:    

Similar News