Durgam Cheruvu Cable Bridge: విద్యుత్‌ దీపకాంతుల మధ్య వంతెన అందాలు..కేబుల్‌ బ్రిడ్జిపై సంగీతోత్సవాలు

Update: 2020-09-28 05:02 GMT

Durgam Cheruvu Cable Bridge: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని కేంద్ర హోం సహాయక మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి గత శుక్రవారం అంటే 25వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం జనసంద్రంగా మారింది. ఆదివారం సాయంత్రం సందర్శకులను అలరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇండియన్‌ ఆర్మీ సింఫనీ బ్యాండ్‌, అవినీతి నిరోధక శాఖ బృందాల సంగీత కచేరీ ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కచేరిని తిలకించేందుకు జనం వేలాదిగా తరలివచ్చారు.

రంగురంగుల విద్యుత్‌ దీపకాంతుల మధ్య వంతెన అందాలను తిలకిస్తూ సెల్ఫీలు దిగుతూ సంతోషంగా గడిపారు. సరిహద్దుల్లో ప్రాణత్యాగంచేసిన వీరులను, కరోనా సమయంలో ముందు వరుసలో ఉన్న వారియర్స్‌కు సంఘీభావం తెలిపే సంగీత కచేరీకి జనం ముగ్ధులయ్యారు. అంతే కాదు ప్రజలలో ఉన్న దేశ భక్తిని వెలికితీసే అద్భుతమైన దేశభక్తి గీతాలు, అలనాటి మధురస్మృతులను గుర్తుచేస్తూ ఆలపించిన తీరు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతరం అనిశా బృందం సభ్యులు మరో గంటపాటు సందర్శకులను అలరించారు. దేశాన్ని కాపాడే ఇండియన్‌ ఆర్మీ సింఫనీ బ్యాండ్‌ 40 మంది సభ్యులతో సంగీత కచేరీని గంటసేపు కొనసాగించారు. ఈ సందర్భంగా పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఈ కేబుల్‌ బ్రిడ్జి నగరానికి సరికొత్త ఐకాన్‌గా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ, ఏపీలో మేజర్‌ జనరల్‌ ఆర్కే సింగ్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ నగరం తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు.

ఇక జుబ్లీ హిల్స్ రోడ్ నం. 45ను కలుపుతూ నిర్మించిన వంతెనకు 'పెద్దమ్మతల్లి ఎక్స్ ప్రెస్‌వే'గా పేరు పెట్టారు. అయితే, ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణ భారం తగ్గుతుంది. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు. ఈ కేబుల్ వంతెనను సందర్శనకు వచ్చిన వారి వాహనాలు పార్కింగ్ చేయడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేసారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణతోపాటు మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌ మధ్య ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గనున్నాయి. దుర్గంచెరువుపై నిర్మించిన ఈ వంతెన దేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా రూపుదిద్దుకుంది.

Tags:    

Similar News