Telangana: ఘనంగా రామానుజాచార్యులు సహస్రాబ్ది వేడుకలు

Telangana: దేశం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు

Update: 2022-02-04 01:57 GMT

Telangana: ఘనంగా రామానుజాచార్యులు సహస్రాబ్ది వేడుకలు

Telangana: సమతామూర్తి రామానుజాచార్యులు సహస్రాబ్ది వేడుకలు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వైభవోపేతంగా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 25వేల మంది భక్తులు హాజరయ్యారు. ఈనెల 14 వరకు జరగనున్న ఉత్సవాలకు అవాంతరాలు కలుగకుండా వేలాది మంది రుత్వికులు, వేదపండితులు పీఠాధిపతులు వాస్తుశాంతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన త్రిదండి చినజీయర్‌స్వామి.. సహస్ర కుండాత్మక మహాలక్ష్మీనారాయణ యాగంలో పాల్గొన్నారు. అనంతరం దివ్యసాకేత మందిరం నుంచి యాగశాల వరకు శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తుల శోభా యాత్ర కన్నుల పండువగా జరిగింది.

తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది కళాకారుల నృత్యాలు, బోనాలు, డోలు వాయిద్యాలు, కోలాటాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలి రోజున అశ్వవాహనంపై శోభాయాత్రగా వచ్చిన శ్రీరామచంద్రమూర్తి.. ప్రతిరోజు ఓ అలంకరణతో యాగశాలకు ఊరేగింపుగా విచ్చేస్తారు. నేటి నుంచి ప్రతిరోజు ఉదయం 6-30 గంటలకు యాగశాల వద్ద అష్టాక్షరి మహామంత్ర జపం నిర్వహించనున్నారు.

ముచ్చింతల్‌కు రేపు ప్రధాని మోడీ రానున్నారు. దాదాపు ఆరుగంటల పాటు నగరంలో పర్యటించనున్న ఆయన రెండు కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 2:10 నిమిషాలకు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. మొదట ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో పటాన్‌చెరులో ఉన్న ఇక్రిశాట్‌కు వెళ్లి తిరిగి సాయంత్రం 5గంటలకు ముచ్చింతల్‌ వస్తారు.

ఇక్కడి దివ్యక్షేత్రంలో శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన దివ్యక్షేత్రంలో మూడుగంటల పాటు గడపనున్నారు. అనంతరం దివ్యక్షేత్రం మొత్తం తిరిగి విశిష్టతలు తెలుసుకుంటారు. యాగశాలలు సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దివ్యక్షేత్రంలో సాయంత్రం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకిస్తారు. రాత్రి 8గంటలకు ముచ్చింతల్‌ దివ్యక్షేత్రం నుంచి తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

ప్రధాని రాక నేపథ్యంలో అధికారులు ఆశ్రమంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. ఎస్‌పీజీ అధికారులు ముచ్చింతల్‌ దివ్య క్షేతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రంగంలోకి దిగిన ఎస్‌పీజీ డీఐజీ నవనీత్‌కుమార్‌ మెహతా, వారి భద్రతా సిబ్బంది సమతామూర్తి ప్రాంగణం, యాగశాల వంటి ప్రాంతాలను చినజీయర్‌స్వామి, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి క్షుణ్నంగా పరిశీలించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ప్రధాని వచ్చి తిరిగి వెళ్లే వరకు వారి ఆధీనంలోనే సమతామూర్తి ప్రాంగణం ఉంటుంది.

ఈనెల 7న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, 8న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, విదేశీ ప్రతినిధులు హాజరుకానున్నారు. 

Tags:    

Similar News