CWC Meeting: రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు

CWC Meeting: అనంతరం 119 నియోజవకర్గాల్లో ముఖ్యనేతల పర్యటన

Update: 2023-09-16 03:26 GMT

CWC Meeting: రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు

CWC Meeting: తెలంగాణ‌తో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ హైద‌రాబాద్‌ను వేదిక‌గా చేసుకున్నది. తొలిసారి హైద‌రాబాద్ గ‌డ్డపై ఇవాళ, రేపు జ‌రిగే కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశానికి పార్టీ అగ్రనేత‌లంతా వ‌రుస‌గా హైద‌రాబాద్‌కు త‌ర‌లిరానున్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. వీరంతా శనివారం మొదటి సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆదివారం అన్ని రాష్ట్రాల పీసీసీ నేతలు, సీఎల్పీ సహా తదితర నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి CWC సమావేశాలు నిర్వహిస్తుండడంతో తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రేపు విజయభేరి బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది.

సెప్టెంబర్ 17న ఉదయం పదిన్నర గంటలకు రెండో రోజు సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించడంతో పాటు వివిధ అంశాలపై క్యాడర్‌కు ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో CWC సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, కౌన్సిల్, ఆఫీస్ బేరర్లు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. వీరికి మొదటి రోజు చర్చించిన అంశాలు, ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో జరిగే విజయభేరి సభలో పాల్గొననున్నారు. ఈ సభలో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడు లేని విధంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు ఖర్గే 4 రాష్ట్రాల సీఎంలు వేదికపై పాల్గొననున్నారు.

దాదాపు 10 లక్షల మందితో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సోనియా గాంధీ చేత 5 గ్యారంటీ స్కీమ్స్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News