'ఫార్మా'కు ఎగబాకిన కరోనా: అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు
ఇటీవల కాలంలో డిగ్రీ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఫార్మా రంగానికి కరోనా వైరస్ పాకింది.
ఇటీవల కాలంలో డిగ్రీ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఫార్మా రంగానికి కరోనా వైరస్ పాకింది. ఏపీ, తెలంగాణాల్లో లక్షల మంది ఈ ఫార్మాల్లో పనిచేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి కేసులు నమోదు కాని ఈ కంపెనీల్లో తాజాగా ఐదు కేసులు నమోదు కావడం కలకలం రేగుతోంది. లాక్ డౌన్ సమయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు వహించి వీటిలో కార్యాకలాపాలు నిర్వహించారు. అంతటి ప్రాధాన్యతా రంగానికి ఒక్కసారే ఈ వైరస్ తాకిందంటే భవిషత్తు ఏ విధంగా ఉంటుందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ ఏ రంగాన్నీ వదలిపెట్టడం లేదు. తాజాగా ఫార్మా ఇండస్ట్రీలోకి కూడా ఈ మహమ్మారి ఎంట్రీ ఇచ్చింది. సంగారెడ్డి జిల్లా బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్న ఆరుగురు కార్మికులు కరోనా బారినపడ్డారు.ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి మొదటి కేసులు ఇవే.
బాధితులు ఓ టాప్ ఫార్మా కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నట్టు తెలిసింది. ఈ ఆరుగురిలో ఇద్దరు సంగారెడ్డి, మరో ఇద్దరు అమీన్‌పూర్‌కి చెందిన వారుకాగా.., మరో ఇద్దరు బొల్లారంలోనే నివాసముంటున్నారు. దీంతో ఒక్కసారిగా బొల్లారంలో కలకలం మొదలైంది.
బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో వందలాది ఫార్మా కంపెనీలతో పాటు పలు తయారీ సంస్థలు ఉన్నాయి. టాప్ కంపెనీలు తమకు సంబంధించిన ఆర్‌అండ్ డీ, తయారీ సౌకర్యాలను ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకున్నాయి. తాజాగా కరోనా కేసులు బయటపడటంతో.. ఆయా కంపెనీలన్నీ అప్రమత్తమమయ్యాయి. తమ తమ సంస్థల్లో శానిటైజేషన్ చర్యలను ముమ్మరం చేశాయి.
మరోవైపు కరోనా సోకిన ఆ ఆరుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికీ వైరస్ లక్షణాలు లేకపోవడంతో అందరినీ హోం క్వారంటైన్ చేశారు.. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం అన్ని నిబంధనలను పాటిస్తున్నామని.. తమ ఉద్యోగుల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత కంపెనీ అధికారులు చెప్పారు.