నిర్మానుషంగా మారిన గుంత‌క‌ల్లు రైల్వే స్టేష‌న్

Guntakal Railway Station: దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన గుంతకల్లు డివిజన్ కరోనా ప్రభావంతో కళ తప్పింది.

Update: 2021-06-12 14:14 GMT

గుంతకల్లు రైల్వే స్టేషన్ ఫైల్ ఫోటో 

Guntakal Railway Station: దక్షిణ మధ్య రైల్వేలో కీలకమైన గుంతకల్లు డివిజన్ కరోనా ప్రభావంతో కళ తప్పింది. నిత్యం రద్దీగా ఉండే స్టేషన్ నిర్మాణుషంగా మారింది. కరోనా మహమ్మారి విజృంభించడంతో పెద్ద ఎత్తున రైళ్లను రద్దు చేశారు అధికారులు. ఆ ప్రభావం ఆటో డ్రైవర్లు, దినకూలీలు, చిరువ్యాపారులపై పడింది. పని లేక పూట గడవడం గగణంగా మారింది. దశాబ్ధాలుగా రైల్వేను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారి బతుకులు చిద్రమవుతున్నాయి. గుంతకల్లు డివిజన్ కేంద్రంలోని ఆటో డ్రైవర్లు, వర్కర్ల ధీన స్థితిపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

గుంతకల్లు రైల్వే డివిజన్‌కు దక్షిణ మధ్య రైల్వే‌లోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం సహా పలు రాష్ట్రాలకు గుంతకల్లు మీదుగా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడే స్టేషన్‌లో చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు, హమాలీలకు చేతి నిండా పని దొరికేది. ఇప్పుడు కరోనా వ్యాప్తితో అధికారులు చాలా వరకూ రైళ్లను రద్దు చేయగా కొన్నింటిని రాత్రి సమయాల్లో నడుపుతున్నారు. దీంతో స్టేషన్‌లో ప్రయాణీకుల లేమితో రైల్వే‌పై ఆధారపడి బతుకుతున్న కూలీలు, ఆటోడ్రైవర్లు, చిరువ్యాపారుల పరిస్థితి కడుదయనీయంగా మారింది.

సాధారణంగా రోజులో 5 వందల వరకూ సంపాదించే ఆటో డ్రైవర్లు ప్రస్తుతం 150 రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నారు. ఎక్కువ రోజులు ఇలాగే కొనసాగితే బతకడం కష్టంగా మారుతుందని అంటున్నారు. రైల్వే అధికారులు, ప్రభుత్వాలు తమ సమస్యకు పరిస్కారం చూపాలని కుటుంబ పోషణకు సాయం చేయాలని కోరుతున్నారు.

గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో 40 మంది హమాలీలు పని చేస్తుండగా ప్రస్తుతం పది మందికి కూడా పని దొరకడం లేదు. రోజూ వంద సంపాదించడం కూడా గగణంగా మారిందని హమాలీలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మాయదారి రోగంతో 2 వందలకు పైగా రైళ్లు రద్దు కావడంతో కూలీల ఆదాయానికి గండి పడింది. రెక్కల కష్టంపై ఆధారపడి బతికే ఈ శ్రమజీవుల బతుకులు చిద్రమవుతున్నాయి.

Tags:    

Similar News