Coronavirus: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
Coronavirus: మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించడంతో * సొంత గ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికులు
Coronavirus: కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. వైరస్ మళ్లీ వ్యాప్తిచెందకుండా మరోసారి పాఠశాలలను తాత్కాళికంగా మూసివేసిన ప్రభుత్వం కరోనా నియంత్రణ చర్యలను మాత్రం తూతూ మంత్రంగానే కొనసాగిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పొట్టకూటి కోసం మహారాష్ట్ర వెళ్లిన వలస కార్మికులు ఆరాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో తిరిగి స్వంత గ్రామాలకు చేరుకుంటున్నారు.
కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వలస కార్మికులు ముంబై, పుణెకు పెద్దఎత్తున తరలివెళ్లారు. అయితే మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభిచడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో వలస కార్మికులు తిరిగి సొంత గ్రామాలకు పయనమవడంతో.. మళ్లీ గ్రామాలలో ఎక్కడ వైరస్ వ్యాప్తిచెందుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారితో కరోనా కేసులు పెరగొచ్చని జనాలు భయపడుతున్నారు.
ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 35వేల మందికిపైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా వైరస్ బారిన పడి 306 మంది మృతిచెందారు. కరోనా కేసుల్లో రెండు స్థానంలో నాగర్‌కర్నూలు ఉండగా.. జోగులాంబ గద్వాల జిల్లా మూడోస్థానంలో ఉంది. వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో కేసులు తక్కువ సంఖ్యలో ఉన్నా తిరిగివస్తున్న వలస కార్మికుల వల్ల కరోనా వ్యాప్తిచెందవచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే సొంతగ్రామాలకు తిరిగి వచ్చే వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం టెస్టుల నిర్వహించి ఒక వేళ పాజిటివ్ నిర్ధారణ అయితే వారికి క్వారంటైన్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.