Revanth Reddy on Covid19 Outbreak in Telangana: తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలి.. కేసీఆర్‌కు రేవంత్ లేఖ

Revanth Reddy on Covid19: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రం ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు.

Update: 2020-06-29 03:27 GMT
Revanth Reddy (File photo)

Revanth Reddy on Covid19 Outbreak in Telangana: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నా రాష్ట్రం ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కరోనా నిర్ధారిత పరీక్షలను పెంచాలని ఐసీఎంఆర్ చెబుతోందని ఆయన గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం ఆ మాటలను పెడ చెవిన పెడుతోందని తప్పుబట్టారు. నామమాత్రంగా చేసిన కరోనా పరీక్షలతోనే 32.1 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఆయన తెలిపారు.

కరోనా విషయంలో ప్రభుత్వం మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని రేవంత్ దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కరోనా వచ్చిన మొదట్లో పారాసిట్‌మాల్‌ మందు బిళ్ల వేసుకుంటే చాలని తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు. వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందని, మంత్రులు కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. కరోనా వైద్యం చేయించుకోవడానికి బాధితులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లేందుకు భయపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లడం కంటే శ్మశానానికి వెళ్లడం మేలని జనం అనుకుంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు.

మొదట్లో దీనిపై ఎమ్మెల్యే సీతక్క మంచి సలహా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఎగతాళి చేశారని రేవంత్ గుర్తు చేశారు. వీఐపీల ప్రాణాలకు ఇస్తున్న విలువను పేద, మధ్యతరగతి కుటుంబీకుల ప్రాణాలకు ఇవ్వడం లేదని రేవంత్ విమర్శించారు. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం కాంగ్రెస్ ఎంపీలకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వెనుక కేసీఆర్‌ ఒత్తిడి ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.



Tags:    

Similar News