చొప్పదండిలో కాంగ్రెస్.. టీఆర్ఎస్ ల మధ్య ఆరోపణల యుద్ధం !

Update: 2020-09-04 09:46 GMT

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం లో టీఆరెస్ కాంగ్రెస్ మధ్య పరస్పర ఆరోపణలు రాజకీయ వేడిని పెంచాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ నేత కమీషన్లు తీసుకున్నారని టీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలతో వాతావరణం వేడెక్కింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకులు వాక్బాణాలు వదులుకుంటున్నారు. రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం కమీషన్లకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఎప్పుడూ మీడియా సమావేశాలు నిర్వహించని వెంకటేశ్వరరావు ప్రతిపక్షానికి అప్రతిష్ట కలిగించే విధంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.

అధికార పార్టీలోనే ఉంటూ చొప్పదండి నియోజకవర్గంలో బీ ఫాం ఒకరికిచ్చి, మరొకరు గెలిచేలా వెంకటేశ్వరరావు నగదు ఖర్చు పెట్టారంటూ కాంగ్రెస్ నేతలు ఘాటుగా విమర్శించారు. చేసిన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు, మీడియా ముందు ఎమ్మెల్యేని పొగడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని టీఆర్ఎస్ నాయకుడు వెంకటేశ్వరరావు ఆధారాలు లేకుండా ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. ఈ సందర్భంగా కమీషన్ల పై బహిరంగ చర్చకు రావాలని ఓపెన్ చాలెంజ్ విసిరారు రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు. చొప్పిదండి నియోజకవర్గంలో ఇలా టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. ఒకరికి ఒకరు కౌంటర్లు వేసుకొనే కన్నా, స్ధానిక ప్రజల సమస్యలపై దృష్టిసారిస్తే ఇరు పార్టీలకు మేలని పలువురు సలహాలు ఇస్తున్నారు.


Tags:    

Similar News