Uttam Kumar Reddy: మాజీ అయితే ఏంటి... ఆయన పట్టు బిగిస్తున్నారా?

Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్ తాజా మాజీ బాస్ పార్టీలో పట్టు కోసం మళ్లీ ప్రయత్రాలు చేస్తున్నారా?

Update: 2021-09-03 10:31 GMT

Uttam Kumar Reddy: మాజీ అయితే ఏంటి... ఆయన పట్టు బిగిస్తున్నారా?

Uttam Kumar Reddy: తెలంగాణ కాంగ్రెస్ తాజా మాజీ బాస్ పార్టీలో పట్టు కోసం మళ్లీ ప్రయత్రాలు చేస్తున్నారా? రేవంత్‌ నియామకం తర్వాత దూరం దూరంగా ఉంటున్న మాజీ చీఫ్‌ మళ్లీ చక్రం తిప్పడానికి పావులు కదుపుతున్నారా? పార్టీలో వరుస బహిష్కరణలకు బ్రేకులు పడడం వెనుక తాజా మాజీ బాస్ హస్తం ఉందా? పార్టీలో ఆయనకు మళ్లీ గ్రిప్ పెరగడంతోనే ఇన్‌ఛార్జ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? గాంధీభవన్‌లో తాజాగా జరుగుతున్న చర్చేంటి?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తాజా మాజీ బాస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ తన పట్టుకోసం విశ్వప్రయత్నానాలు చేస్తున్నారట. పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత నుంచి దూరం దూరంగా ఉంటున్న ఉత్తమ్‌కుమార్ ఇప్పుడు రూటు మార్చి వ్యూహాలకు పదును పెడుతున్నారట. కొత్త బాస్ పార్టీలో సీనియర్లందరిని కలువడానికి ప్రయత్నం చేసినా చివరి వరకు కలువడానికి ససేమీరా అన్న ఉత్తమ్‌ చివరకు దారికి వచ్చారట. కొత్త బాస్‌ బాధ్యతలు తీసుకోవడానికి ఒక్కరోజు ముందు రేవంత్‌రెడ్డిని కలసి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేసేలా వ్యవహరించారు. ఆ తరువాత రేవంత్‌ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలు, దీక్షలకు వెళ్లకుండా డిస్టెన్స్‌ మెంయింటైన్‌ చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలకు కూడా దూరంగా ఉండడంతో కొత్త పీసీసీ అధ్యక్షుడి వర్గానికి మింగుడుపడలేదన్న చర్చ సాగుతోంది.

అయితే, ఇప్పటి వరకు ఇలా సైలెంటుగా ఉన్న తాజా మాజీ బాస్ ఇప్పుడు తన రాజకీయ అనుభవాన్ని రంగరిస్తూ జూలు విదుల్చుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన మద్దతుదారులను కాపాడుకోవడానికి రంగంలో దిగారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల రావిరాల దళత గిరిజన ఆత్మగౌరవ సభ సందర్భంగా గాంధీభవన్‌లో పార్టీ జనరల్ సెక్రటెరీలు సత్యనారాయణరెడ్డి, నిరంజన్‌లు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌పై ఆరోపణలు గుప్పించారు. దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చినా సత్యనారాయణరెడ్డిపై కమిటీ బహిష్కరణ వేటు వేసింది. నిరంజన్ విషయంలో కూడా వేటుకు సిద్ధమైనా ఎందుకోగానీ క్రమశిక్షణ కమిటీ వెనుకడుగు వేసినట్టు తెలిసింది.

ఇక్కడే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి యాక్టివ్‌ రోల్‌ పోషించినట్టు సమాచారం. గాంధీభవన్‌లో జరిగిన అంశాల్లో కూడా వేటు వేస్తే ఎట్లా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అందుకే సత్యనారాయణ విషయంలో దూకుడుగా వ్యవహరించిన క్రమశిక్షణ కమిటీ నిరంజన్‌పై వేటు వేయడానికి వెనుకడుగు వేసినట్టు గాంధీభవన్‌లో మాట్లాడుకుంటున్నారు. ఇక తాజాగా గాంధీభవన్‌లో ముఖ్య నేతల సమావేశానికి మొదటిసారి వచ్చిన తాజా మాజీ బాస్ ఏకంగా పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్‌పైనే ఫైర్ అయినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. కాంగ్రెస్‌‌ను ఒక పార్టీలా నడవనీయ్యాలి కానీ వ్యక్తిపూజ సరైందని కాదంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డట్టు చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌ అభిప్రాయానికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కూడా మద్దతు పలకడం పార్టీలో ఒక కొత్త ప్రచారానికి నాంది పలికిందని చెబుతోంది క్యాడర్‌.

అయితే, ఇన్ని రోజులు సైలెంటుగా ఉన్న తాజా మాజీ బాస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జూలు విదుల్చుతుండడంతో పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొత్త కమిటీలో తన వారితో వ్యూహాలను అమలు చేయిస్తూనే తనకు మద్దతుగా ఉన్న వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అధిష్టానం వద్ద పలుకుబడి ఉండడాన్ని అదునుగా చూసుకొని పార్టీపై మళ్లీ తన పట్టు సంపాదించుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటి పాచికలు వేస్తుంటారన్న చర్చా సాగుతోంది. మరి ఈ పాచికలు ఎప్పటి వరకు ఎలా పనిచేస్తాయో బెడిసికొడుతాయో చూడాలి.

Tags:    

Similar News