కలెక్టర్లతో సీఎం రేవంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌‌

తెలంగాణలో జాతీయ రహదారులతోపాటు హైదరాబాద్ రీజినల్‌ రింగురోడ్డు పనుల కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Update: 2025-09-22 11:02 GMT

తెలంగాణలో జాతీయ రహదారులతోపాటు హైదరాబాద్ రీజినల్‌ రింగురోడ్డు పనుల కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పెండింగులో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు చొరవతీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌ రీజినల్ రింగురోడ్డు కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేయాలని అధికారులను కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి, నేషనల్ హైవేస్‌ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి సూచనలు చేశారు. పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే విషయంపై వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ సిద్ధంచేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

Tags:    

Similar News