తెలంగాణలో మరొకరికి కరోనా వైరస్... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

Update: 2020-03-14 07:36 GMT

కరోనా వైరస్‌ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్‌ అప్రమత్తమయ్యింది. శాసనసభలో కరోనా వైరస్‌పై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి హైలెవల్‌ కమిటీ చర్చిస్తోంది. రాష్ట్రంలో ఈ వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హైలెవల్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చిస్తోందని సీఎం తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం లేకున్నా ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక హైలెవల్‌ కమిటీ చర్చించిన అంశాలను రాష్ట్ర మంత్రివర్గం కూడా చర్చిస్తుందన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తామని సీఎం తెలిపారు. అనంతరం కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ప్రకటిస్తామన్నారు సీఎం.

ఈ వైరస్‌ కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కరోనాపై భయం, ఆందోళన వద్దు. దీన్ని కట్టడి చేసేందుకు అవసరమైతే రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు సీఎం. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సరిపడా మాస్కులు, శానిటైజర్లు, సూట్లు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గతంలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తి కోలుకున్నాడని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు. తెలంగాణలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైందని చెప్పారు. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలిందని సభలో కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని, శాంపిల్స్‌ను పుణె ల్యాబ్‌కు పంపామని కేసీఆర్ చెప్పారు. 

Tags:    

Similar News