CM KCR: హస్తినబాట పట్టిన సీఎం కేసీఆర్

CM KCR: రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, మేధావులతో భేటీ అయ్యే ఛాన్స్

Update: 2022-10-12 01:28 GMT

CM KCR: హస్తినబాట పట్టిన సీఎం కేసీఆర్

CM KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. KCR ఢిల్లీలో ఎన్ని రోజులు ఉండనున్నారు?. హస్తిన వేదికగా ఎవరెవరిని కలవనున్నారు?. టీఆర్ఎస్ పేరు బీ ఆర్ ఎస్ గా మార్చడానికి తీర్మానం చేసి ఎన్నికల కమిషన్ ని కలిసారు ఆ పార్టీ నేతలు. ఆ తర్వాత కేసీఆర్ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తిన బాట పట్టారు. 3 నుండి 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు కేసీఆర్. గతంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన పలువురు నేతలతో కేసీఆర్ సమావేశాలు జరుపుతుంటారు. తాజాగా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లడంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత... తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పేరును BRSగా మారుస్తూ తీర్మానం చేసి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు టీఆర్ఎస్ నేతలు. తొందరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్ రాష్ట్ర సమితిగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి భావిస్తున్నారు. ఢిల్లీ లోని టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. బీ ఆర్ ఎస్ పేరుని ఎన్నికల కమిషన్ ఆమోదం తెలుపగానే ఢిల్లీలోనే సీఎం కేసీఆర్ మకాం వేయనున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న కేసీఆర్ పలువురు జాతీయ స్థాయి నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో సీనియర్ పాత్రికేయులతో సమావేశం కానున్నారట. వారితో దేశ రాజకీయాల్లోకి వెళ్లే అంశాలపై చర్చించనున్నారు.

జాతీయ స్థాయిలో ఏ విధంగా అడుగులు వేయాలన్న దానిపై కేసీఆర్ దృష్టి పెట్టనున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులతో పాటు మేధావులతో కేసీఆర్ సమావేశం కానున్నారని తెలిసింది. దేశ వ్యాప్తంగా ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న అంశంపై చర్చించనున్నారని సమాచారం. ఏఏ రాష్ట్రాలలో ఎలాంటి వనరులు ఉన్నాయి. ఎలాంటి సమస్యలు ఉన్నాయన్న దానిపై ప్రత్యేకంగా ఆరా తీయనున్నారు గులాబీ దళపతి. అలాగే ఇప్పుటికే రైతు ఎజెండాతోనే దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న కేసీఆర్ రైతు నేతలతో ఢిల్లీలో మరోసారి సమావేశం కానున్నారని తెలిసింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే రైతు అవగాహన సదస్సులు, సభల్లో కేసీఆర్ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎవరెవరితో భేటి అయ్యి ఎలాంటి అంశాలపై చర్చిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News