Hyderabad Metro: మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న నగరవాసులు
Hyderabad Metro: రద్దీ పెరుగుతున్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయని మెట్రో అధికారులు
Hyderabad Metro: మెట్రో ప్రయాణానికి మొగ్గు చూపుతున్న నగరవాసులు
Hyderabad Metro: 2023 ఏడాది హైదరాబాద్ మెట్రోలో పెద్దగా మార్పులు తీసుకురాలేదు. ఒక అడుగు ముందుకు వేస్తే రెండడుగులు వెనక్కు వేసినట్టయింది మెట్రో పరిస్థితి. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను బాగా ఆదరించారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. ఈ ఏడు మెట్రో ఎక్స్ టెన్షన్ పనులు ప్రారంభం అవుతాయి అనుకున్నా.. వాటి మీద స్పష్టత లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక మెట్రో పనులకు సంభందించి పలు మార్పులు.. చేర్పులు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ మెట్రో.. నగర రవాణా వ్యవస్థలో చాలా కీలకంగా మారింది. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఈ ఏడాదిలో మెట్రో అభివృద్దిలో పెద్దగా మార్పులు జరగలేదు. మోట్రో రద్దీ పెరుగుతున్నా.. అందుకు తగ్గ ఏర్పాట్లను మెట్రో అధికారులు చెయ్యలేకపోయారు. కోచ్ ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరినా.. హెచ్ఎమ్ఆర్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యలేదు. గత ప్రభుత్వం ఈ ఏడాదిలోనే ఓల్డ్ సిటీ వరకూ మోట్రో పనులు మొదలు పెట్టాలి అని భావించనా.. అవి సైతం ఆచరణకు నోచుకోలేదు.
కొత్త ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రో త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించింది. 6 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించి గ్రౌండ్ లెవల్ వర్క్ ను ఇప్పటికే సిద్దం చేసుకుంది. కాగా ఇది పూర్తి చేస్తే జేబీఎస్.. ఫలక్‌నమా వరకూ మోట్రో పూర్తవుతుంది. దీనికి దాదాపు సంవత్సర సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏడాదిలోనే రాయదుర్గం.. శంషాబాద్ కు సంబంధించిన భూసామర్ధ్య పరీక్షలను కూడా పూర్తయ్యాయి. 33 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును 6 వేల కోట్లతో ప్రభుత్వమే నిర్మిస్తుందని అప్పటి సీఎం కేసిఆర్ ప్రకటించారు.
అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎయిర్ పోర్ట్ మెట్రో వల్ల లాభం లేదని.. ప్రభుత్వానికి అదనపు భారమని భావించింది. దీంతో ఆ ప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. మరోవైపు గ్రేటర్ చుట్టూ 60 వేల కోట్లతో ఔటర్ మెట్రో అందుబాటులోకి తెస్తామని గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. కాని అంతపెద్ద మొత్తంతో ఔటర్ కు మెట్రో అనవసరం అని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది.. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల నుంచి పది కిలోమీటర్ల దూరం వరకు మెట్రోను ఏర్పాటు చెయ్యడానికి మాత్రమే ప్రభుత్వం ఆసక్తి కనబరుస్తోంది. దీంతో ఓల్డ్ సిటీతో పాటు మరో 83 కిలోమీటర్ల మేర మెట్రోకు ఆమోదం లభించినట్టయింది. 2024 లో వీటికి సంబంధించిన పనులు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టు హెచ్ఎమ్ఆర్ వర్గాలు చెబుతున్నాయి.