Nagarjuna Sagar: ఇవాళ సాగర్ ఉపఎన్నిక అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

Nagarjuna Sagar: టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నోముల నర్సింహయ్య కుమారుడు..?

Update: 2021-03-29 03:17 GMT

ఫైల్ ఫోటో 

Nagarjuna Sagar: నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అభ్యర్థులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డిని బరిలో దింపింది. అధికార పార్టీ అభ్యర్ధిని ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే.. టీఆర్ఎస్ దివంగత సిటింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కొడుకు నోముల భగత్‌వైపుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. . జానారెడ్డి లాంటి దిగ్గజాన్ని ఢీ కొట్టేందుకు భగత్‌కే ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తండ్రి గెలుపులో బాసటగా నిలవడం నియోజకవర్గంపై పట్టు ఉండడంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఇవాళ మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ స్వయంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్‌లో జరిగిన నష్టాన్ని పట్టభద్రుల ఎన్నికల్లో పూడ్చుకున్నామని.. సాగర్ ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి ఇక తిరుగులేదని నిరూపించుకోవాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో సాగర్ ఉప ఎన్నికలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సాగర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. మండలానికో నేత చొప్పున రంగంలోకి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేతల అభిప్రాయం, సర్వే రిపోర్ట్‌ ఆధారంగా నోముల భగత్ పేరును సీఎం ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల మాదిరిగానే సాగర్‌లోనూ తమ హవా కొనసాగించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్ధిని బట్టి సామాజిక సమీకరణాల ఆధారంగా తమ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని సిద్ధం అవుతున్నారు. టీఆర్ఎస్‌కు గట్టిపోటీ ఇవ్వాలని బీజేపీ నేతలు భావిస్తోంది. సాగర్ నియోజకవర్గంలో రెడ్డి, యాదవ, ఎస్టీ సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. దాంతో ఆయా వర్గాలను బట్టి అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే అంజయ్య యాదవ్, రవినాయక్‌ల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. నామినేషన్‌లకు గడువు రేపటితో ముగుస్తుండడంతో రేపే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఉప ఎన్నికలో ప్రచారం కోసం రాష్ట్రానికి చెందిన 30 మంది నేతలతో కూడి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ప్రకటించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, కె. లక్ష్మణ్, విజయశాంతిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రచారం చేయనున్నారు. ఇక సాగర్‌లో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనే స్థాయికి బీజేపీ వస్తే.. తాను ప్రచారంలోకి దిగుతానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News