Hyderabad: కుక్కల దాడిలో ఏడాది బాలుడు మృతి
Hyderabad: ఏడాదిన్నర బాలుడిని పొట్టన బెట్టుకున్న వీధి కుక్కలు
Hyderabad: కుక్కల దాడిలో ఏడాది బాలుడు మృతి
Hyderabad: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టన పెట్టుకున్నాయి. గుడిసెలో నిద్రిస్తున్న ఏడాది వయసున్న బాలుడిపై అర్ధరాత్రి దాడి చేసి చంపేశాయి. ఉదయం నిద్ర లేచి చూసే సరికి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. నిర్మానుష్య ప్రాంతంలో చిన్నారి మృతదేహం కనిపించింది. కుక్కల దాడిలో ఛిద్రమైన చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. చిన్నారి నాగరాజు తల్లిదండ్రుల స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రం.
బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. చిన్నారి తండ్రి సూర్య కుమార్ దినసరి కూలీగా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలను పోషిస్తున్నాడు. అయితే బుధవారం అర్ధరాత్రి గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో వీధి కుక్కలు చిన్నారిపై దాడి చేసి చంపేశాయి. శంషాబాద్ సమీపంలోని సామ ఎన్‌క్లేవ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
గతంలో అంబర్‌పేటలో ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన నేటికీ నగరవాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఆ ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా శంషాబాద్‌లో చోటు చేసుకున్న ఘటన కూడా అలాంటిదే. చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన తీరును చూస్తుంటే, ఒళ్లు గగుర్పొడుస్తోంది.