Black Fungus: బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Black Fungus: చికిత్సకు కోఠి ఈఎన్‌టీలో నోడల్‌ కేంద్రం * కరోనా సమయంలో వ్యాధి సోకితే గాంధీలో చికిత్స

Update: 2021-05-16 05:03 GMT

బ్లాక్ ఫంగస్ (ఫైల్ ఇమేజ్)

Black Fungus: రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ కేసుల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితులకు చికిత్స అందించేందుకు కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని నోడల్‌ కేంద్రంగా ప్రకటించింది. కొవిడ్‌ సమయంలోనే బ్లాక్‌ ఫంగస్‌ సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందించనున్నారు. కరోనా రోగుల్లో బ్లాక్‌ఫంగస్‌ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది.

కొవిడ్‌ రోగుల్లో బ్లాక్‌ ఫంగస్‌ రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇందుకోసం ప్రభుత్వ , ప్రైవేట్ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్‌ రోగులకు చికిత్సనందించే సమయంలో షుగర్‌ స్థాయిని సరిగా అదుపు చేయాలని సూచించింది. బ్లాక్‌ఫంగస్‌తో బాధపడుతున్న వారికి ఎక్కువగా ఈఎన్‌టీ సమస్యలు వస్తున్నాయని, రోగులకు కంటి వైద్యుడి అవసరం ఉంటే సరోజినిదేవి ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలంది. గాంధీ ఆసుపత్రి, సరోజినిదేవి, ఈఎన్‌టీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పరస్పరం సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

కరోనా బాధితుల్లో బ్లాక్‌ఫంగస్‌ సోకుతున్నవారి సంఖ్య ఇటీవల ఎక్కువవుతోంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ వాడటం సహా మధుమేహం ఉన్నవారిలో ఇది ఎక్కువగా వస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పలువురు బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. గాంధీ ఆస్పత్రిలోఇప్పటికే కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మ్యుకోర్‌మైసోసిన్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.

ప్రభుత్వ సూచనలను తప్పక పాటించాలని బ్లాక్‌ఫంగస్‌ ముప్పును నివారించాలని ప్రభుత్వ ,ప్రైవేట్ ఆస్పత్రులను సర్కారు కోరింది. ఔషధాలు సమకూర్చుకోవాలి.. బ్లాక్‌ఫంగస్‌ను నియంత్రించే మందులకు దేశవ్యాప్తంగా కొరత నెలకొందన్న ప్రభుత్వం అవసరమైన ఔషధాలను వెంటనే సమకూర్చుకోవాలని టీఎస్‌ఎంఐడీసీకి ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News