Adilabad: రైతుబంధు నగదును హోల్డ్‌లో పెట్టిన బ్యాంకర్లు.. యువ రైతు ఆత్మహత్య

Adilabad: దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదన్న చందంగా మారింది ఆదిలాబాద్‌ జిల్లా రైతుల పరిస్థితి.

Update: 2021-06-23 06:58 GMT

Adilabad: రైతుబంధు నగదును హోల్డ్‌లో పెట్టిన బ్యాంకర్లు.. యువ రైతు ఆత్మహత్య

Adilabad: దేవుడు కరుణించినా పూజారి కనికరించలేదన్న చందంగా మారింది ఆదిలాబాద్‌ జిల్లా రైతుల పరిస్థితి. ఖరీఫ్‌లో పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం అందిస్తున్న రైంతుబంధు నగదును నోటికాడి ముద్దలా లాక్కుంటున్నారు బ్యాంకర్లు. దీంతో మనస్తాపానికి గురై యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

నార్నూర్ మండలం తాడిహత్నూర్‌కు చెందిన అరవింద్ ఖరీఫ్ పంట కోసం సిద్ధమయ్యాడు. పెట్టుబడి ఖర్చుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకంపై ఆశలు పెట్టుకున్నాడు. రెండున్నర ఎకరాలకు సంబంధించి 25 వేల నగదు తన అకౌంట్‌లోకి రాగా డబ్బుల కోసం గంపెడు ఆశలతో బ్యాంకుకు వెళ్లాడు. పాత లోన్‌కు సంబంధించి రైతుబంధు నగదును హోల్డ్‌ లో పెట్టామని, పాత బకాయిలు చెల్లిస్తేనే రైతుబంధు అందిస్తామని బ్యాంకర్లు చెప్పారు. పంట చేతికి రాగానే బకాయి కట్టేస్తానని సిబ్బందితో చెప్పాడు. అయినప్పటికీ రైతుబంధు నగదు ఇచ్చేందుకు ససేమిర అనడంతో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తులను సైతం ఆశ్రయించాడు అరవింద్. అక్కడ కూడా అతడికి మొండి చేయి ఎదురైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అరవింద్‌.

అరవింద్‌ ఆత్మహత్యపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. రైతు అకౌంట్లలో పడ్డ రైతుబంధు నగదును పాతబకాయిల పేరిట హోల్డ్‌లో పెట్టడం దారుణమని అన్నారు. దీనివల్ల ఖరీఫ్‌ సీజన్‌లో విత్తనాలు, ఎరువుల కోనుగోలుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.

Tags:    

Similar News