పద్మ అవార్డులపై రాజుకున్న రగడ... అసలు పద్మ పురస్కారాలు ఎవరికిస్తారు? అందుకు అర్హతలు ఏంటి?
పద్మ పురస్కారాలపై వివాదం ఏంటి? అసలు పద్మ పురస్కారాలు ఎవరికిస్తారు? అందుకు అర్హతలు ఏంటి?
పద్మ అవార్డులపై తెలంగాణలో రగడ రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల విషయంలో తెలంగాణ పట్ల వివక్ష చూపించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. అవార్డుల కోసం సిఫార్సు చేసిన పేర్లేంటి... గద్దర్ కు పద్మ అవార్డు ఎట్లిస్తం.. బరాబర్ ఇవ్వం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఎవరికి పడితే వారికి పద్మ అవార్డులు ఇస్తామా అని బండి అంటే.. బీజేపీ పాట పాడిన వారికే అవార్డులు ఇస్తారా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ అవార్డుల విషయమై సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు కూడా చెప్పారు.
ఇంతకీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి? కేంద్ర ప్రభుత్వం ఈ జాబితాను పూర్తిగా పక్కన పెట్టేసిందా? ఈ ప్రశ్నలకు బదులేమిటో నేటి ట్రెండింగ్ స్టోరీలో తెలుసుకుందాం. అంతేకాదు, అసలు పద్మ అవార్డులకు ఎవరినైనా ఎలా ఎంపిక చేస్తారు, అందుకు ఉండాల్సిన అర్ఙతలు ఏంటన్నది కూడా ఈ స్టోరీలో డిస్కస్ చేద్దాం.
తెలంగాణకు రెండు పద్మ అవార్డులు
రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే 2025 ఏడాదికి గాను 139 పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏడుగురికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది.
వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు దక్కింది. నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, మాదిగల హక్కుల కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ, సాహిత్యం, విద్య విభాగాల్లో కె.ఎల్. కృష్ణ, మాడ్గుల నాగఫణిశర్మ, రాఘవేంద్ర ఆచార్య పంచముఖి, మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి.
రేవంత్ అసంతృప్తికి కారణం ఏంటి?
పద్మ అవార్డుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రజా కళాకారుడు గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డుల కోసం కేంద్రానికి పంపింది.
అయితే తెలంగాణ నుంచి వైద్య రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మాదిగ హక్కుల పోరాటంలో కీలకంగా వ్యవహరించిన మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది. మిగిలిన ఐదుగురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పంపిన ఐదు పేర్లలో ఒక్కరి పేరును కూడా కేంద్రం పద్మ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోలేదు. తెలంగాణ సమాజానికి ప్రతీకలుగా ఉన్న వారి జాబితాను పంపితే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని సీఎం ప్రశ్నించారు.
పద్మ అవార్డులకు అర్హతలు ఏంటి?
దేశంలో పలు రంగాల్లో విశిష్ణ సేవలు అందించినవారికి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తోంది. కేంద్రం ప్రకటించే అవార్డుల్లో అత్యున్నతమైంది భారతరత్న. ఇక రెండో అత్యున్నత అవార్డు పద్మ విభూషణ్, మూడోది పద్మభూషణ్, నాలుగోది పద్మశ్రీ.
సైన్స్, క్రీడలు, సాహిత్యం, విద్య, కళలు, పౌరసేవ, ప్రజా వ్యవహారాలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమలతో పాటు ఆయా రంగాల్లో అసాధారణమైన, విశిష్టమైన సేవలు అందించినందుకు పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. పద్మ అవార్డుల ఎంపికలో సమర్ధత, నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
1954లో పద్మ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. తొలుత పద్మ విభూషణ్ తో పాటు పహేలా వర్గ్, దూస్రా వర్గ్, తీస్రా వర్గ్ అని మూడు వర్గాలుగా అవార్డులను పిలిచేవారు. 1955లో ఈ పేర్లను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీగా మార్చారు. విశిష్ట మైన, అసాధారణమైన సేవకు పద్మవిభూషణ్, అత్యున్నత విశిష్టసేవకు పద్మభూషణ్, విశిష్ట సేవకు పద్మశ్రీ అవార్డు అందిస్తారు. 1978, 1979, 1993-1997 మినహా మిగిలిన ప్రతి ఏటా పద్మ అవార్డులు అందించారు.
పద్మ అవార్డులకు అర్హుల ఎంపికకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ కమిటీ కేంద్రప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవార్డులకు అర్హులు కారు. వృత్తి, జాతి, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అవార్డులకు ఎంపిక చేయవచ్చు.
ప్రతి ఏటా 120 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసుకోవచ్చు. విదేశీయులు, మరణించినవారికి అవార్డులు ప్రకటిస్తే ఈ సంఖ్యకు మినహయింపు ఉంటుంది. 2024 వరకు 50 భారతరత్న, 336 పద్మవిభూషణ్, 1320 పద్మభూషణ్, 3531 పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. పద్మఅవార్డుల్లో భాగంగా పతకం, సర్టిఫికెట్, బ్యాడ్జ్ ఇస్తారు. ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు ఇవ్వదు.
పద్మ అవార్డుల కమిటీని ఎవరు నియమిస్తారు?
పద్మ అవార్డులకు ప్రతి ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సిఫారసులను కేంద్రానికి వెళ్తాయి. కేంద్ర ప్రభుత్వ మంత్రులు, శాఖలు కూడా ఇందుకు సంబంధించిన సిఫారసులను పంపవచ్చు. ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు, కేంద్ర పాలితాలకు చెందిన మంత్రులు కూడా ఈ రకమైన ప్రతిపాదనలను నిర్ణీత గడవులోపుగా పంపవచ్చు. ఈ అవార్డుకు తాము అర్హులమని భావించే సంస్థలు, వ్యక్తులు కూడా ఇందుకు సంబంధించిన దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అవార్డుల కోసం ప్రతి ఏటా ప్రధానమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి కేబినెట్ సెక్రటరీ అధ్యక్షత వహిస్తారు. హోంసెక్రటరీ, రాష్ట్రపతి కార్యదర్శితో పాటు నలుగురి నుంచి ఆరుగురు ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ తయారు చేసిన జాబితా ప్రధానమంత్రి,రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపుతారు. వీరు ఆమోదించిన జాబితాను రిపబ్లిక్ డే కు ముందు రోజున ప్రకటిస్తారు.
గద్దర్‌కు పద్మ అవార్డు ఎలా ఇస్తాం?
పద్మ అవార్డుల ప్రకటనపై రేవంత్ రెడ్డి అసంతృప్తిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరివో పేర్లు పంపి పద్మ అవార్డులు ఇవ్వాలంటే ఇవ్వడం కుదరదని సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలను చంపిన గద్దర్ కు పద్మ అవార్డులు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు.
బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన కాంగ్రెస్
పద్మ అవార్డుకు గద్దర్ ఎలా అర్హుడంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీకి అనుకూలంగా ఉన్నవారికే పద్మ అవార్డులు ఇస్తారా అని ఆ పార్టీ ప్రశ్నించింది. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆ ప్రభుత్వానికే మచ్చ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ సీఎం బహిరంగంగా పద్మ అవార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, దానిపై బీజేపీ నేత బండి సంజయ్ అంతే ఘాటుగా స్పందించడంతో వివాదం తీవ్రంగా మారింది. ఎన్నడూ లేని విధంగా పద్మ పురస్కారాలు ఈసారి రాజకీయ దుమారానికి తెర తీశాయి. సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఈ విషయమై ఎలాంటి లేఖ రాస్తారు? దానిపై కేంద్రం స్పందించే అవకాశం ఉందా? వెయిట్ అండ్ సీ.